MLA Spits in Assembly | రాష్ట్ర శాసనసభలోనే ఓ ఎమ్మెల్యే చేసిన పని అందర్నీ విస్మయానికి గురి చేసింది. పాన్ మసాలా తిని అసెంబ్లీ లోపలికి వెళ్లే ద్వారం వద్దే ఉమ్మేశాడు ఓ ఎమ్మెల్యే. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకుంది.
‘పాన్ మసాలా తిని అసెంబ్లీలోనే ఉమ్మేయ్యడం సిగ్గుచేటు. ఈ పని చేసింది ఎవరో నాకు తెలుసు. సీసీటీవీ ఫుటేజ్ లో చూశా. అయితే అతని పరువును దృష్టిలో పెట్టుకుని పేరు బయటకు చెప్పడం లేదు.
ఆ ఎమ్మెల్యేనే బయటకు వచ్చి చేసిన తప్పును ఒప్పుకోవాలి. లేదంటే నేనే బయటకు చెప్తా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా.
ఉత్తరప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం సభను నిర్వహించారు. అయితే ఓ ఎమ్మెల్యే గుట్కా తిని అసెంబ్లీ ద్వారం వద్దే ఉమ్మేయ్యడం సంచలనంగా మారింది. ఆ పని చేసిన ఎమ్మెల్యే పేరు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే రాష్ట్ర మేలు కోసం శాసనాలు చేయాల్సిన సభ్యులే ఇలా అసభ్యంగా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
గుట్కా తిన్న ఎమ్మెల్యే సభలోనే ఉమ్మేసిన విషయం తెలుసుకున్న స్పీకర్ సతీష్ మహానా అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మేసిన చేరుకుని వెంటనే దాన్ని శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సభను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎమ్మెల్యేల బాధ్యత అని గుర్తుచేశారు.
సభ్యులు ఎవరైనా మరోసారి ఇలా చేస్తే వెంటనే ఇతర సభ్యులు వారించాలని ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లాస్ తీసుకున్నారు. అసెంబ్లీలోనే గుట్కా ఉమ్మేసిన సభ్యుడు ఎవరనేది తనకు తెలుసునని, కానీ వ్యక్తిగతంగా అవమానించే ఉద్దేశ్యం లేదు కనుక పేరును బహిరంగ పరచడం లేదన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుడదని స్పష్టం చేశారు. తప్పు చేసిన ఎమ్మెల్యే ఒప్పుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకూ ఈ పని చేసింది అధికార ఎమ్మెల్యే నా? లేక ప్రతిపక్ష ఎమ్మెల్యే నా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.