Home Minister Amit shah | జమ్ము కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాయి. మరోవైపు ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై దౌత్యపరమైన చర్యలు తీసుకుంటోంది.
ఇప్పటికే సింధు నదీజలాలా ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత్ (India)లో ఉన్న పాకిస్థాన్ (Pakistan) పౌరులు వెంటనే వెళ్లిపోవాలని, పాక్ పౌరులను ఇక నుంచి భారత్లోకి అనుమతించేదని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఫోన్ చేశారు.
రాష్ట్రంలో పాక్ దేశస్తులను వెంటనే గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. అదేవిధంగా స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయుల డేటాను కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో ఉన్న పాకిస్థానీయులపై పోలీసులు ఇప్పటికే ఫోకస్ పెట్టారు. అందుకు సంబంధించి వివరాలను కూడా సేకరించారు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ నగరంలో 208 మంది పాకిస్థానీయులు ఉన్నట్లుగా తేల్చారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. మరో 48 గంటల్లో పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించారు.