- చైర్మన్గా కేకే.. సభ్యులుగా కోదండరాం, పొన్నం!
– జీఓ జారీ చేసిన ప్రభుత్వం!
TG Activists Recognition Committee | తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొని, రాష్ట్ర సాకారం కోసం త్యాగాలు చేసిన ఉద్యమకారులకు అధికారిక గౌరవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
ఉద్యమకారులను గుర్తించి, వారి సేవలను గౌరవించేందుకు గాను ప్రత్యేక హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ (GAD) శుక్రవారం ఉత్తర్వులు (GO) జారీ చేసింది.
కమిటీ చైర్మన్ మరియు సభ్యుల వివరాలు..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కమిటీకి తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలను ఎంపిక చేశారు.
చైర్మన్: డాక్టర్ కె. కేశవరావు (ప్రభుత్వ సలహాదారు)
సభ్యులు:
పొన్నం ప్రభాకర్ (రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి)
ప్రొఫెసర్ ఎం. కోదండరాం (ఎమ్మెల్సీ, మాజీ టీజేఏసీ చైర్మన్)
అద్దంకి దయాకర్ (ఎమ్మెల్సీ – ప్రభుత్వ విప్)
ఎస్. రాములు నాయక్ (మాజీ ఎమ్మెల్సీ)
మోతె శోభన్ రెడ్డి
స్పష్టమైన ప్రమాణాల రూపకల్పన..
అసలైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ముందుగా కొన్ని కఠినమైన, స్పష్టమైన నిబంధనలను (Criteria) ఈ కమిటీ రూపొందిస్తుంది. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారు, లాఠీచార్జీలు-కాల్పుల్లో శారీరక వైకల్యానికి గురైన వారు, కేసులు నమోదై జైలు జీవితం గడిపిన వారి వివరాలను సేకరించి తుది జాబితాను సిద్ధం చేస్తుంది.
ప్రభుత్వానికి సిఫారసులు..
గుర్తించిన ఉద్యమకారులకు ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలి? వారికి అందించాల్సిన ఆర్థిక సహాయం, పెన్షన్, వైద్యం లేదా ఇతర సంక్షేమ సౌకర్యాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.
ఈ ప్రక్రియ కోసం కమిటీ ఎప్పుడైనా అధికారులను పిలిపించుకోవచ్చు, సమావేశాలు నిర్వహించవచ్చు మరియు అవసరమైన సమాచారాన్ని సేకరించవచ్చు. వీలైనంత త్వరగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని జీఓలో స్పష్టం చేశారు.







