Nepal Plane Crash | నేపాల్ (Nepal)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి దాదాపు 72 మందితో వెళ్తున్న యెతీ ఎయిర్‌లైన్స్ (Yeti Airlines) కు చెందిన ప్యాసింజర్ విమానం కుప్పకూలిపోయింది.
ప్రమాద సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

పొఖారా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, పాత విమానాశ్రయం మధ్యలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న మొత్తం 72 మంది మరణించినట్లు సమాచారం.
మృతుల్లో ఇద్దరు నెలల వయసున్న చిన్నారులు సహా 53 మంది నేపాలీలు, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్‌లు, ఇద్దరు కొరియన్‌లు, ఇద్దరు ఐర్లాండ్‌కు చెందినవారు, ఆఫ్ఘనిస్థాన్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
విమాన శిథిలాల నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు నేపాల్ ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు.
నేపాల్ పౌర విమానయాన అథారిటీ (CAAN) ప్రకారం, యెతీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ట్విన్ ఇంజన్ ATR 72 విమానం నేపాల్ రాజధాని ఖాట్మండు (Kathmandu) నుండి ఉదయం 10 : 33 గంటలకు బయలుదేరింది.
పొఖారా విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు దగ్గరగా ఉన్న విమానం సేతి నది ఒడ్డున కూలిపోయింది. టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత క్రాష్ జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోకి వందేభారత్ ఎక్స్ ప్రెస్.. ఈ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
విమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయని, రెస్క్యూ సిబ్బంది దాన్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానిక అధికారి ఒకరు తెలిపారు.
ఘటన నేపథ్యంలో నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ (Pushpa Kamal Dahal) అత్యవసర కేబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు.
భద్రతా దళాలు, హోం శాఖ వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
2013 నుండి నేపాల్‌ను యూరోపియన్ యూనియన్ విమాన భద్రత బ్లాక్‌లిస్ట్ లో ఉంచింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) సూచనలమేరకు నేపాల్ నుంచి దాని గగనతలంలోకి వచ్చే అన్ని విమానాలను నిషేధించాలని ఆదేశించింది.
గతేడాది మేలో నేపాలీ క్యారియర్ తారా ఎయిర్ విమాన ప్రమాదంలో మొత్తం 22 మంది వ్యక్తులు, 16 మంది నేపాలీలు, నలుగురు భారతీయులు మరియు ఇద్దరు జర్మన్లు మరణించారు.