NEET 2026 Canceled | దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ (NEET-UG 2026) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రద్దు చేసింది.
మే 3న జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో, పారదర్శకతను కాపాడేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మే 3న నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఎన్‌టిఏ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీలను వెల్లడిస్తామని, అడ్మిట్ కార్డుల జారీపై విడిగీ సమాచారం ఇస్తామని తెలిపింది.
పరీక్షా పత్రాల లీకేజీ మరియు అవకతవకలపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఆదేశించింది. దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని ఎన్‌టిఏ స్పష్టం చేసింది.
జీపీఎస్ ట్రాకింగ్, ఏఐ ఆధారిత సీసీటీవీ సర్వైలెన్స్ వంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య పరీక్ష నిర్వహించినప్పటికీ, రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) అందించిన ఆధారాలు అక్రమాలు జరిగినట్లు ధృవీకరించాయి.
పేపర్ లీక్ ఆరోపణలతో దేశ రాజధానిలో ఉద్రిక్తత నెలకొంది. శాస్త్రి భవన్ వద్ద విద్యార్థి సంఘాలు (NSUI) భారీ ఎత్తున నిరసన చేపట్టాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్‌టిఏ వివరణ.. మే 7న అక్రమాలపై సమాచారం అందగా, మే 8న కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఈ విషయాన్ని నివేదించామని ఎన్‌టిఏ తెలిపింది. నిష్పక్షపాతంగా పరీక్ష నిర్వహించడమే తమ లక్ష్యమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.







