Kerala Becomes Extreme Poverty Free State | దేవభూమిగా పేరొందిన కేరళ (Kerala) రాష్ట్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన తొలి రాష్ట్రంగా కేరళ అవతరించింది.
ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం అసెంబ్లీలో ప్రకటించారు. నవంబర్ 1న కేరళ అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక సమావేశంలో సీఎం ఈ చారిత్రాత్మక ప్రకటన చేశారు.
“ఈరోజు కేరళ రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప మైలురాయిని చేరుకున్నాం. కేరళలో ఇకపై తీవ్ర పేదరికం లేదు. ఇది సరికొత్త కేరళ సృష్టి దిశగా మరో గొప్ప అడుగు,” అని విజయన్ పేర్కొన్నారు.
2021లో కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే తీవ్ర పేదరిక నిర్మూలనకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇది ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటని చెప్పారు. దేశంలో 100 శాతం అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత, సంపూర్ణ విద్యుతీకరణ సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచిన కేరళ, తీవ్ర పేదరికం నిర్మూలనకు రూ.1,000 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు తెలిపారు.
అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రతిపక్షం ఈ ప్రకటనను “నకిలీ ప్రచారం”గా అభివర్ణించి అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించింది.









