- రోడ్డు ప్రమాదాల నివారణకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం!
Vehicle 2 Vehicle Communication | దేశంలో నానాటికీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను (Road Accidents) నియంత్రించేదుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. అందులో భాగంగా ఒక సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టనుంది.
దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచే లక్ష్యంతో వాహనాల మధ్య నేరుగా సమాచారాన్ని పంచుకునే వెహికిల్ టూ వెహికిల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (Vehicle2Vehicle Communication Technology)ని 2026 చివరి నాటికి అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
ఈ సాంకేతికత ద్వారా వాహనాలు ఎలాంటి నెట్‌వర్క్ అవసరం లేకుండా పరస్పరం సంకేతాలను పంపుకోవచ్చు. తద్వారా రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా డైవర్లను అప్రమత్తం చేస్తుంది. ఈ ప్రతిపాదనపై రాష్ట్ర రవాణా మంత్రులతో జరిగిన వార్షిక సమావేశంలో చర్చించినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు.
పార్క్ చేసిన వాహనాలను వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొట్టే ప్రమాదాలు, శీతాకాలంలో పొగమంచు కారణంగా జరిగే భారీ ప్రమాదాలను ఈ వ్యవస్థ తగ్గించగలదని ఆయన చెప్పారు. ఈ వ్యవస్థ వాహనంలో అమర్చే సిమ్ లాంటి పరికరం ద్వారా పనిచేస్తుందని తెలిపారు.
ఏ దిశ నుంచైనా మరో వాహనం ప్రమాదకరంగా దగ్గరైతే డ్రైవర్‌కు తక్షణ హెచ్చరికలు అందుతాయి. ముఖ్యంగా దట్టమైన పొగమంచులో ఇది ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. ప్రపంచంలో కొద్ది దేశాల్లో మాత్రమే ఈ విధానం ఉందని, దీనికి సుమారు రూ.5,000 కోట్ల వ్యయం అవుతుందని రోడ్డు రవాణా కార్యదర్శి వి ఉమాశంకర్ చెప్పారు. కొత్త వాహనాల నుంచి దశలవారీగా ఈ టెక్నాలజీని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు వెల్లడించారు.









