ICC Worldcup Schedule | క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ (ICC World Cup) షెడ్యూల్ ఖరారైంది.
ఏయే తేదీల్లో ఏయే మ్యాచ్ లు ఉంటాయో పూర్తి షెడ్యూల్ ను ఐసీసీ (ICC) విడుదల చేసింది.
2023 అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు జరిగే ఈ ప్రపంచకప్ పోటీకి ఈసారి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది.
46 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ వేడుకను దేశవ్యాప్తంగా మొత్తం 10 స్టేడియాల్లో నిర్వహించనున్నారు.
ప్రపంచ కప్ కు ఇప్పటికే ఇండియా తో పాటు ఆఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్, పాకిస్తాన్ మరియు దక్షిణ ఆఫ్రికా క్వాలిఫై అయ్యాయి. ఇంకో రెండు స్థానాల కోసం ఇతర దేశాలు పోటీ పడుతున్నాయి.
2019 ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన ఇంగ్లాండ్ మరియు న్యూజీలాండ్ జట్లు అక్టోబర్ 5 న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మొదటి మ్యాచ్ లో తలపడబోతున్నాయి.
నవంబర్ 15 ,16 వ తేదీల్లో ముంబై మరియు కోల్ కత్తా (Kolkata) నగరాల్లో సెమీఫైనల్స్ నిర్వహించనున్నారు. చివరగా నవంబర్ 19 న అహ్మదాబాద్ లోనే ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది.
ఈ ప్రపంచ కప్ లో టీం ఇండియా సెమీఫైనల్, ఫైనల్ కాకుండా మొత్తం 9 మ్యాచులు ఆడబోతుంది. అందులో రెండు క్వాలిఫయర్ మ్యాచులు.
పాకిస్తాన్ తో మ్యాచ్ ఎప్పుడంటే..
లీడ్ దశలో భారత్ మొత్తం 9 మ్యాచ్ లు ఆడనుంది. వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ను భారత్ అక్టోబర్ 8న చెన్నై (Chennai) వేదికగా ఆస్ట్రేలియాతో తలపడుతుంది.
ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తికనబరిచే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India Vs Pakistan) మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగబోతుంది.
ఇంకా కేవలం 100 రోజుల గడువు మాత్రమే ఉండగా భారత్ టీం ఎటువంటి స్ట్రాటజీ తో ముందుకు పోతుందో చూడాలి.
అలాగే దాదాపు పుష్కర కాలం తర్వాత భారత గడ్డ పైన ఈ పోటీ జరుగుతుంది. 2011లో ఉపఖండంలో నిర్వహించిన వరల్డ్ కప్ నకు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చాయి.
ప్రస్తుతం కేవలం భారత్ లో ఈ ప్రపంచకప్ జరగనుంది. దీంతో టీమిండియాపై అభిమానుల్లో అనేక అంచనాలు ఉన్నాయి.
గత వరల్డ్ కప్ లలో రెండు సార్లు సెమి ఫైనల్ స్టేజి లో నిష్క్రమించిన ఇండియా ఇప్పుడు విజయ తీరాలకు చేరుతుందా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ఉప్పల్ లో మూడే మ్యాచ్ లు..
భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్ నిర్వహిస్తున్న వేళ తెలుగు అభిమానులకు నిరాశే మిగిలింది. హైదరాబాద్ (Hyderabad)లోని ఉప్పల్ స్టేడియంలో కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే నిర్వహించనున్నారు.
అవి కూడా క్వాలిఫైయర్ టీమ్స్‌తో జరిగేవే కావడం గమనార్హం. అందులోనూ రెండు పాకిస్తాన్ ఆడే మ్యాచులు. మరొకటి న్యూజిల్యాండ్ ఆడే మ్యాచ్.