Thursday 28th May 2026
12:07:03 PM
Home > తాజా > గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌లో అద్భుతం.. 3.6 కిలోల ‘బాల భీముడు’ జననం!

గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌లో అద్భుతం.. 3.6 కిలోల ‘బాల భీముడు’ జననం!

3.6 Kg Baby Boy Born In Gandhi Hospital IVF Center | సికింద్రాబాద్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐవీఎఫ్ (IVF) సెంటర్ ఒక పేద దంపతుల జీవితంలో తీరని వెలుగులు నింపింది.

తొమ్మిదేళ్లుగా పిల్లలు లేక ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరిగి విసిగిపోయిన భువనగిరి జిల్లాకు చెందిన దంపతులకు గాంధీ వైద్యులు ఉచితంగా ఐవీఎఫ్ వైద్యం అందించి అండగా నిలిచారు.

ఈ క్రమంలో సదరు మహిళ బుధవారం సుమారు 3.6 కిలోల బరువుతో ఉన్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అంత బరువుతో పుట్టిన ఆ ‘బాల భీముడిని’ చూసి అటు తల్లిదండ్రులు, ఇటు వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

9 ఏళ్ల నిరీక్షణ – 12 సార్లు ఫెయిల్యూర్స్..
భువనగిరి జిల్లాకు చెందిన రవి, సౌమ్య దంపతులకు 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లై ఇన్నేళ్లవుతున్నా సంతానం కలగకపోవడంతో వారు తీవ్ర మానసిక వేదనను అనుభవించారు.

సంతానం కోసం పలు కార్పొరేట్, ప్రైవేటు ఫర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించి లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఖర్చు పెట్టుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 12 సార్లు ఓఐ (OI), ఐయూఐ (IUI) వంటి విభిన్న ప్రొసీజర్లు చేయించుకున్నప్పటికీ వారికి నిరాశే ఎదురైంది.

గాంధీలో తొలి ప్రయత్నంలోనే సక్సెస్!
ప్రైవేట్ వైద్యంపై ఆశలు వదులుకున్న ఈ దంపతులు.. గతేడాది గాంధీ హాస్పిటల్‌లో నూతనంగా ప్రారంభమైన ఐవీఎఫ్ సెంటర్‌ను ఆశ్రయించారు. దంపతుల ఆరోగ్య సమస్యను నిశితంగా పరిశీలించిన గాంధీ వైద్యులు వారికి ఐవీఎఫ్ (IVF) ప్రక్రియను ప్రారంభించారు.

ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మొదలైనప్పటి నుంచి యాంటినాటల్ చెకప్స్, అవసరమైన ఖరీదైన మెడిసిన్ (మందులు) అన్నీ గాంధీలోనే పూర్తి ఉచితంగా అందజేశామని వైద్యులు శోభ, ఫాతిమా వివరించారు.

గాంధీ వైద్యుల పర్యవేక్షణలో మే 27న సౌమ్యకు డెలివరీ కాగా.. 3.6 కిలోల బరువుతో మగబిడ్డ జన్మించాడు. ప్రస్తుతం తల్లి, బాబు ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని డాక్టర్లు ప్రకటించారు.

ప్రైవేట్ లో లక్షలు పోసినా దక్కని ఫలితం.. గాంధీలో రూపాయి ఖర్చు లేకుండా దక్కిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి సగర్వంగా తెలిపారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions