Doctor Saves Boy with CPR | ఆడుకుంటూ కరెంట్ షాక్ కు గురై అపస్మారక స్థితికి వెళ్లిన బాలుడికి సీపీఆర్ చేసిన ప్రాణం పోశారు ఓ డాక్టర్. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే విజయవాడ అయ్యప్ప నగర్ కు చెందిన ఆరేళ్ళ బాలుడు సాయి ఈ నెల 5న కరెంట్ షాక్ కు గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన కొడుకును తల్లిదండ్రులు భుజాన వేసుకొని పరుగులు తీయసాగారు.
ఈ సమయంలో అటుగా వెళ్తున్న మెడిసిస్ ఆసుపత్రిలో డాక్టర్ గా సేవలందిస్తున్న నన్నపనేని రవళి, పరుగులు తీస్తున్న తల్లిందండ్రులను అడిగి విషయం తెలుసుకున్నారు. వెంటనే బాలుడ్ని రోడ్డుపై పడుకోబెట్టి సీపీఆర్ చేయడం ఆరంభించారు.
ఛాతిపై చేతితో ఒత్తుతూ, అక్కడున్న మరో వ్యక్తిని నోట్లోకి గాలిని ఊదమని చెప్పారు. ఇలా ఏడు నిమిషాల తర్వాత బాలుడిలో కదలిక వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కాగా ప్రస్తుతం ఆ బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. దైవంలా వచ్చి సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి బాలుడి ప్రాణాలను కాపాడిన డాక్టర్ రవళిని అందరూ అభినందిస్తున్నారు.