-ప్రజలకు అభివాదం చేస్తూ వెళుతున్న కాంగ్రెస్ నేతలు
-మరికాసేపట్లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రత్యేక ఆహ్వానితులుగా కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలిసిందే. నగరంలోని హోటల్ తాజ్ కృష్ణాలో సోనియా కుటుంబానికి బస ఏర్పాటు చేశారు.
హోటల్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో కలిసి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. కారులో రాహుల్ ముందు కూర్చోగా ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి వెనక సీటులో కూర్చున్నారు. సెక్యూరిటీ సిబ్బంది కార్లు అనుసరిస్తుండగా వారి కాన్వాయ్ ముందుకు సాగింది. రోడ్డు పక్కన నిలుచుని నినాదాలు చేస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ రాహుల్, రేవంత్ లు ముందుకు సాగారు.