Cm himanta blames miyas for vegetable price hikes
దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ధరల పెరుగుదల వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.
కూరగాయల ధరలు పెరగడానికి వివిధ కారణాలను ప్రభుత్వం చెబుతుంది. ముఖ్యంగా డిమాండ్ బాగా పెరగడం వల్ల, అలాగే కొన్ని ప్రాంతాల్లో పంట దెబ్బ తినడం మూలంగా ధరలు పెరుగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కానీ అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వాశర్మ ధరల పెరుగుదలకు ముస్లింలే కారణం అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Assam| దేశంతో పాటుగా అస్సాం రాష్ట్రంలో కూడా కూరగాయ ధరలు పెరుగుతున్నాయి. ధరల పెరుగుదలకు ‘మియా’ ముస్లింలే ప్రధాన కారణం అని అస్సాం ముఖ్యమంత్రి , బీజేపీ నేత హిమాంత బిస్వాశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ గౌహతిలో కూరగాయల ధరలు పెరుగుతున్నాయని, ఎందుకంటే అమ్మకందారులలో ఎక్కువ మంది ‘మియా’ కమ్యూనిటీకి చెందినవారే ఉన్నారని హిమాంత అన్నారు.
‘మియా’ కమ్యూనిటీ లేకుండా అస్సాం అసంపూర్తిగా ఉంటుందని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) అధ్యక్షుడు మరియు ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ చేసిన వ్యాఖ్యల తర్వాత హిమాంత ఈ విధంగా ప్రకటన చేశారు.
మియా ముస్లింలు 20వ శతాబ్దంలో బ్రిటిష్ వారి సమయంలో అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో నివాసం ఏర్పరుచుకున్న బెంగాలీ ముస్లింల వారసులు.
నగరంలో కూరగాయల ధరలు పెరగడానికి మియా విక్రయదారులే కారణమని, ధరలు పెంచుతున్న కూరగాయల విక్రయదారులలో ఎక్కువ మంది మియా కమ్యూనిటీకి చెందినవారేనని హిమాంత విలేకరులతో అన్నారు.
ప్రస్తుతం దేశంలో టమాటా ధరలతో పాటు ఇతర అన్ని కూరగాయల ధరలు కూడా భారీగా పెరగడం, సామాన్య ప్రజలు కూరగాయలపైనే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన తెలిపారు.
గ్రామంలో రైతులు విక్రయించే కూరగాయలకు ఎక్కువ ధర లేదని, అదే కూరగాయలను గ్రామం నుండి నగరానికి తీసుకువచ్చి గౌహతిలో విక్రయించినప్పుడు వాటి ధరలు పెరుగుతున్నాయని అస్సాం ముఖ్యమంత్రి అన్నారు.
”మియా ప్రజలు ఎక్కువగా గౌహతిలో కూరగాయలు అమ్మడమే దీనికి కారణం. అస్సామీ ప్రజలు కూరగాయలు విక్రయిస్తే, వారు తమ తోటి అస్సామీ ప్రజల నుండి ఎక్కువ ధరను వసూలు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
“అస్సామీ యువకులు ముందుకు రావాలని నేను కోరుతున్నాను మరియు ‘మియా’ ముస్లిం కూరగాయల అమ్మకందారులందరినీ నగరం నుండి తరిమివేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను” అని సీఎం హిమాంత వ్యాఖ్యానించారు.