BJP Leaders Buy Electric Vehicles | దేశంలో ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు పర్యావరణాన్ని కాపాడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు బీజేపీ నేతలు ఆచరణలో ముందడుగు వేస్తున్నారు.
పెరుగుతున్న కాలుష్య నివారణకు, స్వచ్ఛమైన ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా పలువురు కీలక నేతలు ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వైపు మొగ్గు చూపుతున్నారు.
తాజాగా తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ఎన్. రాం చందర్ రావు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కొత్తగా ఈవీ వాహనాలను కొనుగోలు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై తాను పాల్గొనే స్థానిక అధికారిక, వ్యక్తిగత కార్యక్రమాలన్నింటికీ ఈ ఎలక్ట్రిక్ బైక్ పైనే ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
అంతేకాకుండా, ఇతర సుదూర ప్రాంతాలలో తన అధికారిక పర్యటనల కోసం కూడా ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే వినియోగించాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా తెలంగాణ బీజేపీ నేత ఎన్. రాం చందర్ రావు సరికొత్త ఈవీ కారును కొనుగోలు చేశారు.
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన స్వయంగా తన ఈవీ కారులోనే ప్రయాణించి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇది కేవలం ఇంధన పొదుపు మాత్రమే కాదు.. కాలుష్య నియంత్రణతో పాటు రాబోయే తరాలకు స్వచ్ఛమైన, పచ్చని భవిష్యత్తును నిర్మించే దిశగా వేసిన కీలక అడుగు. రాబోయే కాలం ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వాహనాలదే” అని నొక్కిచెప్పారు.
“లీడర్స్ అంటే మాటలు చెప్పడం కాదు.. చేసి చూపించాలి! ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపునకు బీజేపీ నేతలు యాక్షన్ లోకి దిగారు.
తెలంగాణ బీజేపీ నేత రాం చందర్ రావు సరికొత్త ఈవీ కారు కొనగా.. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈవీ బైక్ కొనుగోలు చేశారు. ఇకపై లోకల్ టూర్లన్నీ ఈవీ బైక్ పైనే వెళ్తానని కేంద్ర మంత్రి చెప్తుంటే.. రాబోయే కాలం ఈవీలదే అంటున్నారు రాం చందర్ రావు.







