Thursday 28th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బక్రీద్ బలి నుంచి తప్పించుకున్న ‘ట్రంప్’!  

బక్రీద్ బలి నుంచి తప్పించుకున్న ‘ట్రంప్’!  

  • లాస్ట్ మినిట్ లో జూకి తరలింపు!

Donald Trump Buffalo | బంగ్లాదేశ్‌లో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన “డోనాల్డ్ ట్రంప్” అనే పేరు పెట్టిన తెల్లటి దున్నపోతు చివరి నిమిషంలో ప్రాణాలతో బయటపడింది.

బక్రీద్ పండుగ సందర్భంగా బలి ఇవ్వడం కోసం దాదాపు 700 కిలోల బరువున్న ఈ జంతువును ఇప్పటికే ఒకరు కొనుగోలు చేశారు. అయితే, దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న విపరీతమైన పబ్లిక్ అటెన్షన్, క్రేజ్ దృష్ట్యా బంగ్లాదేశ్ ప్రభుత్వం అనూహ్యంగా రంగంలోకి దిగింది.

ఆ అరుదైన జీవిని బలి ఇవ్వకుండా కాపాడాలంటూ స్వయంగా అక్కడి హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ అరుదైన జీవిని ఢాకాలోని నేషనల్ జూలాజికల్ పార్క్‌కు తరలించారు. అక్కడ దానికి ప్రత్యేక షెడ్, కేర్‌టేకర్‌ను ఏర్పాటు చేశారు.

బంగ్లాదేశ్‌కు చెందిన జియా ఉద్దీన్ మృధా అనే 38 ఏళ్ల రైతుకు చెందిన ఈ దున్నపోతుకు.. అతని తమ్ముడు సరదాగా ‘ట్రంప్’ అని పేరు పెట్టాడు.

సాధారణంగా నల్లగా ఉండే దున్నపోతులకు భిన్నంగా.. ఇది తెల్లటి చర్మం కలిగి ఉండటమే కాకుండా, దీని తలపై దట్టమైన బంగారు వర్ణంలో జుట్టు ఉంటుంది.

ఇది చూడటానికి అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ హెయిర్ స్టైల్‌ను పోలి ఉండటంతో ఈ పేరు స్థిరపడిపోయింది. సరదాగా పెట్టిన ఈ పేరు కాస్తా సోషల్ మీడియాలో మీమ్స్, వీడియోల ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది.  

ప్రభుత్వం లాస్ట్ మినిట్ ఎంట్రీ..
ఈ జంతువుపై ప్రజల్లో ఉన్న విపరీతమైన ఆసక్తి మరియు భద్రతా కారణాల దృష్ట్యా.. దాన్ని బలి ఇవ్వకుండా కాపాడాలని బంగ్లాదేశ్ హోం మంత్రి సలావుద్దీన్ అహ్మద్ స్వయంగా పోలీసులను, పశుసంవర్ధక శాఖను ఆదేశించారు.

పండుగ కోసం ఆ జంతువును కొన్న వ్యక్తికి ప్రభుత్వం డబ్బులను తిరిగి చెల్లించేలా (Refund) చేసింది. జూ క్యూరేటర్ అతికర్ రెహమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ జంతువును రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వైద్య పరీక్షల అనంతరం సాధారణ ప్రజల సందర్శనకు అనుమతించనున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions