– ఏపీలో కొత్త జనాభా పాలసీ!
Chandrababu Naidu Population Policy 2026 | ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న జనాభా వృద్ధి రేటును అరికట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విప్లవాత్మక మరియు సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.
రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటును పెంచే లక్ష్యంతో.. కుటుంబంలో మూడో మగ/ఆడ బిడ్డ జన్మిస్తే రూ. 30,000, నాలుగో బిడ్డ జన్మిస్తే రూ. 40,000 ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.
శనివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ బహిరంగ సభలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని, దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు మరియు అదనపు వివరాలను నెల రోజుల్లో అధికారికంగా జీఓ (GO) రూపంలో విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
గతంలో అసెంబ్లీ వేదికగా రెండో బిడ్డ జన్మిస్తే రూ. 25,000 ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా ఆ పరిమితిని మూడు, నాలుగో బిడ్డకు కూడా వర్తింపజేస్తూ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
న్యూ ఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్‌లో సీఎం పేర్కొన్నట్లు.. మూడో బిడ్డ పుడితే కేష్ ఆన్ డెలివరీతో పాటు, ఐదేళ్ల పాటు నెలకు రూ. 1,000 చొప్పున పోషకాహారం, శిశు అభివృద్ధి కోసం అందించనున్నారు.
పిల్లల పెంపకం ఉమ్మడి బాధ్యత అని గుర్తు చేస్తూ.. తల్లులకు ఏడాది పాటు ప్రసూతి సెలవులు (Maternity Leave), తండ్రులకు 1 నుండి 2 నెలల పితృత్వ సెలవులు (Paternity Leave) కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
“సమాజంలో ఆదాయాలు పెరిగే కొద్దీ చాలా మంది దంపతులు ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు. మరికొందరు మొదటి బిడ్డ అబ్బాయి కాకపోతేనే రెండో సంతానానికి మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల ఏపీలో జనాభా స్థిరత్వానికి అవసరమైన రీప్లేస్‌మెంట్ లెవెల్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ (TFR) 2.1 కంటే చాలా తక్కువగా ఉంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీఎఫ్ఆర్ 2.2 ఉంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో అది కేవలం 1.5 మాత్రమే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో యువత తగ్గి, వృద్ధుల జనాభా పెరిగి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. పిల్లలు భారం కాదు.. దేశానికి ఆస్తి అని నేను నిరూపిస్తా” అని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.







