- ‘నిశ్శబ్దం ఒక అరుదైన విలాసం’ అంటూ ప్రశంసలు
Anand Mahindra Praises Aizawl Traffic Discipline మన దేశంలోని మెట్రో నగరాల్లో ట్రాఫిక్ జామ్ అయిందంటే చాలు.. చెవులు చిల్లులు పడేలా హారన్ల మోత, ఒకరినొకరు దాటుకుని వెళ్లాలనే తొందరపాటు సర్వసాధారణం. కానీ మిజోరాం రాజధాని ఐజ్వాల్ (Aizawl) నగరంలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.
రద్దీగా ఉన్న రోడ్డుపై వాహనాలు బారులు తీరినా, ఏ ఒక్కరూ హారన్ కొట్టకుండా ఎంతో ఓపికగా తమ వంతు కోసం వేచి చూస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆదివారం (నవంబర్ 22) తన ‘ఎక్స్’ (X) ఖాతాలో షేర్ చేస్తూ ఐజ్వాల్ ప్రజల ట్రాఫిక్ క్రమశిక్షణను ఆకాశానికెత్తారు.
వైరల్ వీడియోలో ఏముంది?
ఒక స్థానిక మహిళ ఐజ్వాల్ నగరంలోని రద్దీ రోడ్డును వీడియో తీస్తూ అక్కడి ట్రాఫిక్ సంస్కృతిని వివరించారు. “ఇక్కడ చాలా వాహనాలు ఉన్నాయి, కానీ ఒక్క హారన్ కూడా వినిపించదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎందుకంటే ఇక్కడి ప్రజలకు ఎంతో ఓపిక ఉంది, మేము ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తాం” అని ఆమె ఎంతో గర్వంగా చెప్పారు.
రోడ్డుపై వాహనాలు కిక్కిరిసి ఉన్నా.. డ్రైవర్లు ఒకరినొకరు ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించకుండా, నిర్ణీత స్టాప్ లైన్ (Stop Line) వెనుక మాత్రమే ఆగి సిగ్నల్స్‌ను గౌరవిస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
2017లో ఐజ్వాల్ నగరంలో ప్రవేశపెట్టిన ‘నో-హాంకింగ్ పాలసీ’ (No-honking policy) మరియు అక్కడి లేన్ క్రమశిక్షణ గురించి తాను గతంలో రాసిన విషయాలను ఆనంద్ మహీంద్రా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. “ఈ రోజు ఆ సామూహిక క్రమశిక్షణ ఫలితాన్ని చూస్తున్నాను.. ఆ మహిళ ఎంతో గర్వంగా చెబుతున్న తన నగరపు నిశ్శబ్దం నన్ను ఆలోచింపజేస్తోంది” అని మహీంద్రా పేర్కొన్నారు.
“రద్దీగా ఉండే మన మెట్రో నగరాల్లో ‘నిశ్శబ్దం’ (Quietness) అనేది ఒక అరుదైన విలాసంగా (Rare luxury) మారిపోయింది. భవిష్యత్తులో ప్రజలు కేవలం ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలను చూడటానికే కాకుండా.. ప్రశాంతమైన నిశ్శబ్దాన్ని అనుభవించడానికి (Quest for quiet) కూడా ఐజ్వాల్ వంటి నగరాలకు పర్యటనకు వెళ్లే రోజులు వస్తాయి” అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ.. మన నగరాల్లోని వాహనదారులు కూడా ఐజ్వాల్ ప్రజలను చూసి నేర్చుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.











