- కుర్చీకి రాహుల్ ఫోటో పెట్టి చాయ్ తాగిన విద్యార్థులు!
BRSV OU Students Protest Ashok Nagar Rahul Gandhi Visit కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ (OU) విద్యార్థులు అశోక్ నగర్లో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఉద్యోగాల హామీని నెరవేర్చలేదని ఆరోపిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.
కుర్చీకి రాహుల్ ఫోటో పెట్టి చాయ్ పే చర్చ..
అశోక్ నగర్లో ఒక ఖాళీ కుర్చీని ఏర్పాటు చేసి, దానికి రాహుల్ గాంధీ ఫోటోను అతికించి పలువురు ఓయూ విద్యార్థులు చాయ్ తాగుతూ నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్లోని టీ స్టాల్ వద్ద నిరుద్యోగ యువతతో కలిసి చాయ్ తాగిన రాహుల్ గాంధీ.. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని విద్యార్థి నాయకులు గుర్తుచేశారు.
మూడేళ్లయినా 6 లక్షల ఉద్యోగాల ఊసే లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు భర్తీ చేయాల్సిన 6 లక్షల ఉద్యోగాల ఊసే లేదని, కనీసం 10 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని విద్యార్థులు మండిపడ్డారు.
‘భారత్ సమ్మిట్’ (Bharat Summit) కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ.. నేరుగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్ వద్దకు వచ్చి నిరుద్యోగులతో కలిసి చాయ్ తాగాలని, 6 లక్షల ఉద్యోగాల హామీపై స్పష్టత ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.











