- ‘ఆర్థా ఫిన్‌టెక్’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు!
Sridhar Babu Inaugurates Artha FinTech తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ఫైనాన్షియల్ టెక్నాలజీ (FinTech) మరియు గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకు అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సింగపూర్ కేంద్రంగా అంతర్జాతీయ సేవలు అందిస్తున్న ప్రముఖ సంస్థ ‘ఆర్థా ఫిన్‌టెక్’ (Artha FinTech) నూతన కార్యాలయాన్ని శనివారం హైటెక్ సిటీలో ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణలో ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ బలోపేతంపై మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు.
తెలంగాణ రైజింగ్–2047 విజన్ దిశగా అడుగులు..
ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్‌లో పరిశోధన మరియు అభివృద్ధి (R&D)కి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. పరిశ్రమల ఆధునిక అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించి, గ్లోబల్ ఫిన్‌టెక్ రంగానికి అవసరమైన హ్యూమన్ రిసోర్సెస్‌ను సిద్ధం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్-2047 విజన్..
ఐటీ/ఐటీఈఎస్ రంగంలో హైదరాబాద్ సాధించిన గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్‌ను డిజిటల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి విస్తరిస్తున్నామన్నారు. తెలంగాణను ప్రపంచవ్యాప్త పెట్టుబడులకు, ఆవిష్కరణలకు (Innovations) అత్యుత్తమ గమ్యస్థానంగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని వివరించారు.
ఆర్థా ఫిన్‌టెక్ సేవల విస్తరణ..
సింగపూర్ ఆధారిత ఆర్థా ఫిన్‌టెక్ సంస్థ అందించే అత్యాధునిక సాంకేతిక సేవల గురించి మంత్రి వివరించారు. బ్యాంకింగ్-యాజ్-ఏ-సర్వీస్ (BaaS), ఓపెన్ బ్యాంకింగ్ APIలు, ఆటోమేటెడ్ ఆన్‌బోర్డింగ్, KYC/KYB, AML (యాంటీ మనీ లాండరింగ్), అంతర్జాతీయ చెల్లింపుల మౌలిక సదుపాయాలను ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా విస్తరిస్తుండటం శుభపరిణామమని కొనియాడారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్థా ఫిన్‌టెక్ సీఈఓ మధు బాబు గడిపాటి, ప్రతినిధులు ఆర్మిన్ ఒర్డోడరీ, ఇమాన్యుయేల్ సి. ఫెర్నాండెస్ తదితరులు పాల్గొన్నారు.











