Delhi Police FIR On Meta CSEAM Content సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లలో చిన్నారులకు సంబంధించిన లైంగిక దోపిడీ, వేధింపుల కంటెంట్ (CSEAM) అందుబాటులో ఉందన్న తీవ్ర ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు (FIR) నమోదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనూంగో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ధృవీకరించారు.
మెటా హెడ్‌కు సమన్లు..
ఈ వ్యవహారంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) ఇప్పటికే పూర్తిస్థాయి విచారణను వేగవంతం చేసింది. చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్ ప్రకటనల రూపంలో అందుబాటులోకి రావడంపై సెప్టెంబర్ 16న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని మెటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సంస్థ అధిపతికి ఎన్సీపీసీఆర్ సమన్లు జారీ చేసింది. జులై 3న జారీ చేసిన నోటీసులకు మెటా సమర్పించిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో, వాస్తవాలను తేల్చేందుకు అధికారిక విచారణ చేపట్టాలని కమిషన్ నిర్ణయించింది.
సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14C)కి మెటా ఫిర్యాదులు..
ఎన్సీపీసీఆర్ నిరంతర నిఘా మరియు చర్యల నేపథ్యంలో మెటా తన నిబంధనల్లో మార్పులు చేసింది. తమ వేదికలపై నమోదయ్యే చిన్నారుల లైంగిక వేధింపుల కేసులను ఇకపై కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14C) నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ పోర్టల్‌కు నేరుగా నివేదించడం ప్రారంభించినట్లు మెటా ప్రతినిధి తెలిపారు. ఆన్లైన్లో చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నేరస్థులను చట్టం ముందు నిలబెట్టేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మెటా స్పష్టం చేసింది.
క్యాప్‌జెమినీ డేకేర్ కేంద్రంపైనా విచారణ..
మరోవైపు బెంగళూరులోని IT దిగ్గజం క్యాప్‌జెమిని (Capgemini) నిర్వహిస్తున్న డేకేర్ కేంద్రంలో చిన్నారులపై వేధింపులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపైనా ఎన్సీపీసీఆర్ విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంలో స్పష్టత ఇచ్చేందుకు సెప్టెంబర్ 16న విచారణకు హాజరుకావాలని క్యాప్‌జెమిని ఉపాధ్యక్షుడికి కూడా సమన్లు జారీ చేశారు







