Supreme Court On Arrest ప్రాథమిక హక్కుల రక్షణ మరియు వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి (Detention) తీసుకున్న సమయం నుంచే రాజ్యాంగం ప్రకారం నిర్దేశించిన 24 గంటల గడువు ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది.
అధికారికంగా ‘అరెస్టు మెమో’లో నమోదైన సమయం ఆధారంగా మాత్రమే ఈ గడువును లెక్కిస్తామన్న పోలీసుల వాదన చెల్లదని తేల్చిచెప్పింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చంద్రుర్కర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం ఈ మేరకు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
అరెస్ట్ మెమో ప్రామాణికం కాదు..
వ్యక్తి స్వేచ్ఛను హరించిన క్షణం నుంచే 24 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. విచారణ, సోదాలు, వస్తువుల స్వాధీనం లేదా దర్యాప్తు పేరుతో నిర్బంధంలో ఉంచిన సమయాన్ని గడువు నుంచి మినహాయించడానికి వీల్లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) ప్రకారం.. నిందితుడిని అరెస్టు చేసిన ప్రదేశం నుంచి మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకెళ్లేందుకు పట్టే ప్రయాణ సమయం (Journey Time) తప్ప మరిదేన్నీ మినహాయించరాదు.
హైకోర్టుల గత అభిప్రాయాలు చెల్లవు..
ఒడిశా (ఆర్యమన్ పట్నాయక్ కేసు), మద్రాస్ (కణ్ణన్ కేసు), కేరళ (అరుణ్ కె. థామస్ కేసు) హైకోర్టులు గతంలో అధికారిక అరెస్ట్‌కు ముందున్న సమయాన్ని మినహాయించవచ్చని ఇచ్చిన ఉత్తర్వులు చట్టబద్ధమైనవి కావని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
మేజిస్ట్రేట్లకు స్పష్టమైన ఆదేశాలు..
- 24 గంటల గడువు ముగిసినా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకపోతే, సంబంధిత వ్యక్తిని తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేసింది.
- మేజిస్ట్రేట్లు నిందితుడిని హాజరుపరిచినప్పుడు.. పోలీసులు అతడిని ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారనే అసలు తేదీ, సమయాన్ని స్వతంత్రంగా రికార్డు చేయాలి.
- నిర్బంధ వ్యవధి కేసు పరిస్థితులకు అనుగుణంగా ఉందో లేదో (BNSS సెక్షన్ 58 ప్రకారం) పరిశీలించాలి. 24 గంటల లోపే ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా, అనవసరంగా నిర్బంధించినట్లు తోస్తే రిమాండ్ తిరస్కరించి నిందితుడిని విడుదల చేసే అధికారం మేజిస్ట్రేట్లకు ఉంటుందని తెలిపింది.
ఎన్డీపీఎస్ కేసు నేపథ్యం (త్రిపుర ఘటన):
మాదకద్రవ్యాల నిరోధక చట్టం (NDPS Act) కింద త్రిపురలో నమోదైన ఒక కేసులో నలుగురు వ్యక్తులను 2025 సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 2 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ, ఆ తదుపరి రోజు यानी సెప్టెంబర్ 30 ఉదయం 11 గంటలకు మాత్రమే అధికారిక అరెస్ట్ చూపించారు.
అంటే దాదాపు 18 గంటల పాటు ఎలాంటి న్యాయ పర్యవేక్షణ లేకుండా వారిని నిర్బంధంలో ఉంచడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల గడువు సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 2 గంటల నుంచే వర్తిస్తుందని సంచలన తీర్పునిస్తూ పిటిషనర్లకు ఊరటనిచ్చింది.








