Telangana High Court No Coercive Action Dussehra Vacation దసరా సెలవుల సమయంలో కోర్టు వివాదాల్లో ఉన్న ఆస్తులపై ఎలాంటి బలవంతపు చర్యలు (Coercive action) చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 17 శనివారం నుంచి అక్టోబర్ 25 ఆదివారం వరకు ఎలాంటి తొలగింపులు లేదా కూల్చివేతలు చేపట్టవద్దని తేల్చిచెప్పింది.
జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) ఈ నిబంధనలను కచ్చితంగా పాటించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. అయితే చట్టప్రకారంగా సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసే వెసులుబాటు అధికారులకు ఉంటుందని కోర్టు పేర్కొంది.
లంచ్ మోషన్ పిటిషన్..
ఖమ్మం జిల్లాకు చెందిన సీలం లీలావతి దాఖలు చేసిన అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె వివాదాస్పద ఆస్తి విషయంలో ‘స్టేటస్ కో’ (యథాతథ స్థితి) కొనసాగించాలని ఆదేశించింది.
బార్ అసోసియేషన్ ఆందోళన..
దసరా సెలవుల సమయంలో కోర్టులు మూసి ఉండే అవకాశాన్ని ఆసరాగా చేసుకుని రెవెన్యూ అధికారులు, హైడ్రా యంత్రాంగం వివాదాస్పద భూములపై ఏకపక్షంగా కూల్చివేతలు చేపడితే బాధితులకు తక్షణ న్యాయం లభించదని తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా కోర్టు దృష్టికి తెచ్చింది. న్యాయవాదుల సంఘం లేవనెత్తిన ఈ ప్రజా సమస్యపై హైకోర్టు సకాలంలో స్పందించడాన్ని బార్ అసోసియేషన్ కార్యవర్గం స్వాగతించింది. ఇది చట్టబద్ధ పాలనకు, న్యాయ వ్యవస్థ ప్రాముఖ్యతకు నిదర్శనమని పేర్కొంది.
బాధురాలి వాదనలు..
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామంలోని తన రెండు ఎకరాల భూమిలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పశువుల కొట్టాన్ని కూల్చివేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారని లీలావతి కోర్టుకు తెలిపారు. తమ వద్ద పట్టాదారు పాసుపుస్తకాలు, ధరణి పోర్టల్ రికార్డులు, కరెంట్ బిల్లులు ఉన్నాయని ఆమె తరఫు న్యాయవాది వాదించారు.
అక్టోబర్ 12న వీఆర్ఓ స్థానికులతో కలిసి వచ్చి కొట్టాన్ని కూల్చేస్తామని బెదిరించారని ఆరోపించారు. ఈ వాదనలను విన్న కోర్టు.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశిస్తూ విచారణను నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.











