Jayaprakash Narayana On Hyderabad Traffic హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యంపై లోక్‌సత్తా పార్టీ అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ (జేపీ) కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో సరైన ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడం వల్లే ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
ప్రపంచంలోని పలు సంపన్న నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే వ్యక్తిగత వాహనాల వినియోగం చాలా ఎక్కువగా ఉందని జేపీ పేర్కొన్నారు. వివిధ నగరాలతో వాహనాల సంఖ్య పోలిస్తే హైదరాబాద్ లోప్రతి 100 మంది జనాభాకి ఏకంగా 70 ప్రైవేటు వాహనాలు ఉన్నాయి. సింగపూర్‌లో ప్రతి 100 మందికి కేవలం 11 ప్రైవేటు వాహనాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి 100 మందికి 16 నుండి 17 వాహనాలు ఉంటాయి. లండన్, న్యూయార్క్ నగరాల్లో ప్రతి 100 మందికి 24 నుండి 26 వాహనాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు.
ప్రజా రవాణా వైఫల్యం..
లండన్, న్యూయార్క్, సింగపూర్ కంటే హైదరాబాద్ గొప్పదేమీ కాదు, కానీ ఇక్కడ సరైన క్వాలిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సమయానికి లభించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని జేపీ స్పష్టం చేశారు. మెట్రో లేదా ఆర్టీసీ బస్సు ఎక్కినా, గమ్యస్థానానికి చేరుకోవడానికి అయ్యే ‘ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ’కి 40 శాతం సమయం, 60 శాతం ఖర్చు అవుతోందని వివరించారు.
ఈ తిప్పలు పడలేకనే చాలామంది సొంత కారు లేదా బైక్‌లపై రోడ్లపైకి వస్తున్నారన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రధాన రహదారులు కిక్కిరిసిపోవడానికి, ఇంధన దండగకు మరియు వాహన కాలుష్యం పెరగడానికి ఈ ప్రైవేటు వాహనాల వినియోగమే కారణమని చెప్పారు.











