Donald Trump Calls Super Intelligence అమెరికా అధికారిక రికార్డులు మరియు ప్రభుత్వ పత్రాల్లో ఇకపై ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) అనే పదాన్ని పూర్తిగా మారుస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఐక్యరాజ్యసమితి (UN) జనరల్ అసెంబ్లీ వేదికగా ప్రసంగించిన ఆయన, ఏఐకి బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI) అనే నూతన పదాన్ని ఉపయోగిస్తామని స్పష్టం చేశారు.
“ఆర్టిఫిషియల్ అనే పదం ఫేక్ (నకిలీ) లా అనిపిస్తోంది. కానీ ఇది ఫేక్ కాదు.. అద్భుతమైనది. అదే సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
‘సూపర్ ఇంటెలిజెన్స్’ (SI)గా నామకరణం..
అమెరికా ప్రభుత్వ అధికారిక పత్రాల్లో ‘ఏఐ’ స్థానంలో ఇకపై ‘ఎస్ఐ’ (SI) అని ఉపయోగిస్తామని, ప్రపంచం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ‘ఆర్టిఫిషియల్’ అనే పదం ఈ సాంకేతికత సామర్థ్యాన్ని తగ్గించి చూపేలా ఉందనడం వల్లనే ఈ మార్పు చేసినట్లు చెప్పారు.
“సూపర్ ఇంటెలిజెన్స్ రేసులో ఎవరు గెలిస్తే, వాళ్లే ప్రపంచంలో విజేతలుగా నిలుస్తారు” అని వ్యాఖ్యానిస్తూ సాంకేతిక రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పారిశ్రామిక విప్లవం కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికత పురోగతిని నిలిపివేయబోమని, తగిన భద్రతా జాగ్రత్తలతో ముందుకు తీసుకెళ్తామని ట్రంప్ పునరుద్ఘాటించారు.








