Monday 24th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం: సీఎం ప్రకటన

ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం: సీఎం ప్రకటన

  • విస్తరించిన ఉచిత బస్సు ప్రయాణం!

CM Vijay Announces Free LPG Scheme | తమిళనాడు శాసనసభలో ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ రాష్ట్ర ప్రజల కోసం పలు సంచలనాత్మక సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఏటా మూడు ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను అందించడంతో పాటు, ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ట్రాన్స్‌జెండర్లకు కూడా విస్తరిస్తున్నట్లు సభ వేదికగా వెల్లడించారు.

‘అన్నపూర్ణి సూపర్‌ సిక్స్‌’ – ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం..

గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, గ్యాస్ కొరత మరియు పెరుగుతున్న ధరల భారం నుంచి కుటుంబాలను ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 2027 సంక్రాంతి పండుగ నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది.

ఏటా రూ. 2.5 లక్షల లోపు రాబడి ఉన్న నిరుపేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.

అర్హులైన కుటుంబాలు కొనుగోలు చేసే మూడు గ్యాస్‌ సిలిండర్ల సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో (DBT) జమ చేస్తారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ. 4,000 కోట్ల వ్యయాన్ని అంచనా వేసింది.

‘వెట్రి పయనం’తో ఉచిత బస్సు ప్రయాణం..

మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత విస్తరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్, ఎల్‌ఎస్‌ఎస్ (LSS), డీలక్స్ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చు. జిల్లాల మధ్య నడిచే దూరప్రాంత బస్సులకు కూడా ఇది వర్తిస్తుంది.

‘వెట్రి పయనం’ పేరుతో ఈ విస్తరించిన సేవలు అక్టోబర్ 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు విజయ్ ప్రకటించారు.

పరందూర్‌ విమానాశ్రయంపై స్పష్టత..

చెన్నై సమీపంలో ప్రతిపాదించిన పరందూర్‌ విమానాశ్రయ ప్రాజెక్టుపై సీఎం విజయ్ తన వ్యతిరేకతను మరోసారి స్పష్టం చేశారు. ప్రాజెక్టు వల్ల నివాసాలు, భూములు కోల్పోయే బాధితులకు అండగా ఉంటామని చెప్పారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలిస్తోందని, ఇప్పటికే కొన్ని స్థలాలను గుర్తించినట్లు వెల్లడించారు. అలాగే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మీనంబాక్కం (చెన్నై) విమానాశ్రయంలోనే కొత్త ‘టెర్మినల్-5’ను నిర్మించనున్నట్లు సభకు తెలిపారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions