Saturday 22nd August 2026
12:07:03 PM
Home > తాజా > సినిమాల్లోకి రాకముందే ఆయన నాకు హీరో.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ పోస్ట్!

సినిమాల్లోకి రాకముందే ఆయన నాకు హీరో.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ పోస్ట్!

chiranjeevi pawan kalyan

Pawan Kalyan Emotional Birthday Post to Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు, జనసేనాని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా అత్యంత ప్రేమానురాగాలు, పాత జ్ఞాపకాలతో కూడిన భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

“అన్నయ్య గురించి తలచుకోవడం ఎప్పుడూ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది” అంటూ తన చిన్ననాటి ముచ్చట్ల నుంచి చిరంజీవి ఎదిగిన ప్రస్థానం వరకు పలు ఆసక్తికర విషయాలను గుర్తుచేసుకున్నారు.

నా మొదటి హీరో అన్నయ్యే!

పండుగలా వచ్చే వేసవి సెలవులు: చిన్నతనంలో అన్నయ్య నర్సాపూర్‌లో కాలేజీ చదువుతున్నప్పుడు వేసవి సెలవులకు ఇంటికి రావడం ఒక పండుగలా ఉండేదని, తిరిగి వెళ్లేటప్పుడు ఇల్లంతా నిరాశగా మారేదని తెలిపారు.

పొడవైన ఉంగరాల జుట్టు, ఎన్‌సీసీ క్యాడెట్ రూపం, బెల్-బాటమ్ ప్యాంట్‌తో నాన్నగారి 350cc బుల్లెట్ బైక్‌పై వస్తుంటే ఒక రియల్ హీరోని చూసినట్లే ఉండేదని, సినిమాల్లోకి రాకముందే ఆయన తనకు హీరో అని చెప్పారు.

సింగపూర్ నుంచి మొదటిసారి వచ్చినప్పుడు తెచ్చిన పెద్ద నీలం రంగు బ్యాగ్‌లో తనకు లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, కామిక్స్, పెర్ఫ్యూమ్‌లు తెచ్చి ఇంట్లో ఆనందాన్ని నింపారని గుర్తుచేసుకున్నారు.

అన్నయ్యకు పెళ్లయ్యాక తమకు దూరమవుతారేమోనని గదిలో ఏడుస్తుంటే, వదిన సురేఖను తీసుకువచ్చి నవ్వుతూ పరిచయం చేసిన తీరును పవన్ పంచుకున్నారు.

పరిశ్రమలో కష్టం.. అంకితభావం..

చెన్నైలోని తీవ్రమైన ఉక్కపోతలో 18 గంటల పాటు కష్టపడి, చెమటతో తడిసిన దుస్తులతో అర్ధరాత్రి ఇంటికి వచ్చే అన్నయ్య పడే శ్రమను దగ్గరుండి చూశానని తెలిపారు. ‘ప్రతిబంధ్’, ‘ఆజ్ కా గూండా రాజ్’ వంటి చిత్రాలతో ఉత్తరాది, దక్షిణాది చిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక వారధిగా నిలిచారని కొనియాడారు.

ఇటీవల వెన్నెముకకు పెద్ద ఆపరేషన్ జరిగినా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తీవ్రమైన వర్కవుట్స్‌తో పుంజుకుని తిరిగి సెట్స్‌పైకి వెళ్లారని, “నగరం నిద్రపోవచ్చు కానీ అన్నయ్య విశ్రాంతి తీసుకోడు” అని పేర్కొన్నారు.

“లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చి జీవితాలను మార్చిన నా అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవడం కేవలం లాంఛనం కాదు, అదొక సున్నితమైన జ్ఞాపకం” అని చెబుతూ పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు ఆయురారోగ్యాలు, విజయాలు కలగాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions