- పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భార్యపై తీవ్ర ఆరోపణలు!
- ‘రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి’.. పంజాబ్ పోలీసులకు NHRC ఆదేశాలు!
NHRC Probe Allegations Punjab CM Bhagwant Mann Wife పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్యపై వచ్చిన తీవ్ర ఆరోపణల వ్యవహారాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా పరిగణించింది.
ఒక అత్యాచార కేసును అణచివేసేందుకు రూ. 5 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపి, రెండు వారాల్లోగా ‘తీసుకున్న చర్యల నివేదిక’ (Action Taken Report – ATR) సమర్పించాలని పంజాబ్ సీఎస్, డీజీపీలను ఆదేశించింది.
ఫిర్యాదులో ఉన్న ప్రధాన ఆరోపణలు..
పంజాబ్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ NHRCకి అందిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు ప్రారంభమయ్యాయి.
ఒక అత్యాచార కేసు విచారణను తొక్కిపెట్టడానికి, కేసు నుంచి నిందితులను తప్పించడానికి ముఖ్యమంత్రి భార్య తరఫున డబ్బు డిమాండ్ చేశారనేది ప్రధాన ఆరోపణ.
ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని NHRC ధర్మాసనం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. పంజాబ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (Chief Secretary), పోలీసు డైరెక్టర్ జనరల్ (DGP)లు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
కేంద్ర హోం శాఖ దృష్టికి: మహిళల భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో, NHRC ఈ ఫిర్యాదును పరిశీలన నిమిత్తం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘ఉమెన్ సేఫ్టీ డివిజన్’ (Women Safety Division) కు కూడా పంపించింది.
NHRC స్పష్టత..
ఈ దశలో వచ్చిన ఆరోపణలను తాము ఇంకా నిర్ధారించలేదని (Unverified) NHRC స్పష్టం చేసింది. మానవ హక్కుల పరిరక్షణ పరిధిలో ఫిర్యాదు అందినందున, నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నుంచి అధికారిక సమాచారాన్ని కోరడం జరిగిందని తెలిపింది.
రాష్ట్ర అధికారులు సమర్పించే ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ (ATR)ను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలపై కమిషన్ ఒక నిర్ణయానికి రానుంది.







