Saturday 4th July 2026
12:07:03 PM
Home > తాజా > దేశంలోనే తొలిసారి.. ఒకేసారి 5 అవయవాల మార్పిడి!

దేశంలోనే తొలిసారి.. ఒకేసారి 5 అవయవాల మార్పిడి!

  • ఉస్మానియా డాక్టర్లను సన్మానించిన మంత్రి దామోదర రాజనర్సింహ!

Osmania Hospital 5 Organs Transplant | భారతీయ వైద్య రంగ చరిత్రలోనే నిలిచిపోయేలా.. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital) వైద్యులు అసాధారణమైన ఘనతను సాధించారు.

దేశంలోనే తొలిసారిగా ఒకే రోగికి, ఒకే సమయంలో విజయవంతంగా 5 అవయవాల మార్పిడి (Multi-Visceral Transplantation) చేసి సరికొత్త రికార్డు సృష్టించారు.

ఈ చారిత్రాత్మక విజయం సాధించిన ఉస్మానియా వైద్య బృందాన్ని (Transplant Team) రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో (Secretariat) ఘనంగా సన్మానించారు.

Read Also: పాఠశాల సమీపంలో ఆ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలపై నిషేధం!

ఉస్మానియా డాక్టర్లు దేశానికే గర్వకారణం..

సచివాలయంలో జరిగిన ఈ ప్రత్యేక అభినందన సభలో ట్రాన్స్‌ప్లాంట్ బృంద సభ్యులకు మంత్రి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో (Osmania Hospital 5 Organs Transplant) ఒకటిగా భావించే మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించడం అసాధారణ విజయమని మంత్రి కొనియాడారు.

ఉస్మానియా వైద్యులు సాధించిన ఈ ఘనత తెలంగాణతో పాటు, యావత్ దేశానికే గర్వకారణమన్నారు.

Read Also: 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. సీఎం రేవంత్ ఎమోషనల్ పోస్ట్!

36 గంటల సుదీర్ఘ శ్రమ..

ప్రముఖ వైద్యులు డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఏకంగా 36 గంటల పాటు నిరంతరాయంగా శ్రమించి ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేయడం అభినందనీయమన్నారు.

ఈ బృందంలో భాగస్వాములైన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు, క్రిటికల్ కేర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మరియు ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్లను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

అవయవదాత కుటుంబానికి సెల్యూట్: ఈ సందర్భంగా అవయవదానం ద్వారా మరొకరికి పునర్జన్మ ప్రసాదించిన దాత కుటుంబ సభ్యుల త్యాగాన్ని, సేవాభావాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేకంగా ప్రశంసించారు.

“అవయవదానం… మహాదానం” అనే గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరూ సమాజంలో విస్తృతంగా చాటి చెప్పాలని, అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

ప్రభుత్వ వైద్యరంగంలో ఉస్మానియా ఆసుపత్రి సాధించిన ఈ విజయం ఎంతోమంది రోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions