- హత్యకు 34 నిమిషాల ముందు ప్రియుడితో సీక్రెట్ కాల్..
- బాలి ట్రిప్ క్యాన్సిల్ చేయడానికి పాస్‌పోర్ట్ మాయం!
Ketan Agarwal Murder Case | దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పుణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో విచారణ చేస్తున్నా కొద్దీ మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ దారుణ ఘాతుకానికి ఒడిగట్టిన ప్రధాన నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిల పక్కా క్రిమినల్ ప్లానింగ్‌ను వివరిస్తూ తాజాగా మరికొన్ని సంచలన నిజాలను పోలీసులు బయటపెట్టారు. హత్యకు సరిగ్గా 34 నిమిషాల ముందు సియా తన ప్రియుడికి సీక్రెట్ కాల్ చేసినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా స్పష్టమైంది.
హత్యకు 34 నిమిషాల ముందు వ్యూహం..
పోలీసులు సేకరించిన కాల్ డేటా రికార్డుల (CDR) ప్రకారం.. కేతన్‌ను లోయలోకి తోసి హత్య చేయడానికి సరిగ్గా 34 నిమిషాల ముందు సియా గోయల్ తన ప్రియుడు, సహ నిందితుడైన చేతన్ చౌదరికి ఫోన్ చేసింది. ఈ ఫోన్ కాల్ ముగిసిన వెంటనే, ఇద్దరూ తాము ముందుగా వేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం హత్య ప్రణాళికను అమలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆధారాలను చెరిపివేయడానికి వారు మొబైల్ చాట్‌లు, ఇతర డిజిటల్ డేటాను డిలీట్ చేయగా.. ఫోరెన్సిక్ నిపుణులు ప్రస్తుతం ఆ సమాచారాన్ని రికవరీ చేసే పనిలో పడ్డారు.
బాలి ట్రిప్ రద్దు వెనుక పాస్‌పోర్టు కుట్ర..
జూన్ 6న ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కోసం కేతన్, సియాలు ఇండోనేషియాలోని బాలి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, చివరి నిమిషంలో కేతన్ పాస్‌పోర్టు కనిపించకపోవడంతో ఆ పర్యటన రద్దయింది. దర్యాప్తులో దీని వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది.
బాలి ట్రిప్ గనుక జరిగితే తమ హత్య ప్రణాళికకు ఆటంకం కలుగుతుందని భావించిన సియా గోయల్, ఉద్దేశపూర్వకంగానే కేతన్ పాస్‌పోర్ట్ ను మాయం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
వీరిని ముంబై విమానాశ్రయానికి తీసుకెళ్లిన క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు విచారించగా కీలక సాక్ష్యం లభించింది. ప్రయాణం మధ్యలో సియా కారు ఆపమని చెప్పి, కొద్దిసేపు ఒంటరిగా బయటకు వెళ్లిందని.. ఆ సమయంలోనే ఆమె పాస్‌పోర్టును ఎక్కడో దాచిపెట్టి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎయిర్‌పోర్టుకు వెళ్లాక పాస్‌పోర్ట్ లేకపోవడంతో బాలి ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఇద్దరూ తిరిగి పుణెకు వచ్చేశారు.
కేతన్ తండ్రి ఆవేదన.. ఒకే పర్సులో ఉంచినా మాయం!
పాస్‌పోర్టు కనిపించకుండా పోవడంపై కేతన్ తండ్రి వ్యక్తంచేసిన అనుమానాలు కూడా ఈ కుట్రకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కారులో మొత్తం నలుగురు ఎయిర్‌పోర్టుకు వెళ్లారని, ఎక్కేముందు అందరూ తమ పాస్‌పోర్టులు, డాక్యుమెంట్‌లను సరిచూసుకుని వాటన్నింటినీ ఒకే పర్సులో భద్రపరిచారని ఆయన తెలిపారు.
అయితే, ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక కేవలం కేతన్ పాస్‌పోర్టు మాత్రమే మాయం కావడం సియా ప్లాన్ ప్రకారమే జరిగిందని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, డ్రైవర్ స్టేట్‌మెంట్‌లతో పోలీసులు గట్టి ఆధారాలను సిద్ధం చేస్తున్నారు.








