- ‘పెద్ది’ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగం!
Chiranjeevi Peddi Movie Success Meet Speech | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, మెగాస్టార్ చిరంజీవి వందశాతం పుత్రోత్సాహాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఈ సినిమా సాధించిన భారీ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఆయన తన కుమారుడు రామ్ చరణ్‌కు ఒక సరికొత్త పేరును ఇచ్చారు.
హైదరాబాద్ వేదికగా మంగళవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగిన ‘పెద్ది’ చిత్ర విజయోత్సవ (సక్సెస్ మీట్) వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర యూనిట్‌ను అభినందించారు.
‘పెద్ది’ సినిమా నన్ను బాగా కదిలించింది..
సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ‘పెద్ది’ చిత్రం చూసి తాను చాలా భావోద్వేగానికి గురయ్యానని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ సుభిక్షంగా ఉండటానికి ఇలాంటి అద్భుతమైన కథాంశాలు ఉన్న సినిమాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని ఆయన ఆకాంక్షించారు.
ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటనను చిరంజీవి ఆకాశానికెత్తారు. ఈ తరుణంలోనే ఆయన మాట్లాడుతూ.. “ఇకపై నా పేరు చిరంజీవి కాదు.. ‘చరణ్ జీవి’” అని గ్లోబల్ స్టార్‌కు సరికొత్త బిరుదును ఇస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
మోదీతో చరణ్ భేటీ.. ‘న్యూ ఏజ్ మెగాస్టార్’..
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి రామ్ చరణ్ ఒకే వేదికను పంచుకున్న విషయాన్ని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఆ కార్యక్రమంలో నిర్వాహకులు రామ్ చరణ్‌ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ (నవతరం మెగాస్టార్) అని సంబోధించడం తనకు ఎంతో గర్వాన్ని, సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.
“బిడ్డలు మనకంటే ఒక స్థాయికి ఎదిగినప్పుడు తల్లిదండ్రులుగా కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఇప్పుడు నేను వెనుక ఉండి, రామ్ చరణ్‌ను ముందు నడిపించాల్సిన సమయం వచ్చింది.” అని పేర్కొన్నారు చిరు.
మెగాస్టార్ చిరంజీవి తండ్రి స్థానంలో ఉండి కొడుకు ఎదుగుదలను చూసి చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.







