Pawan Kalyan Condemns Comments On Vangalapudi Anitha | ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి, వైకాపా నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.వైకాపా నేతలు రాజకీయ విమర్శలు చేయాల్సింది పోయి, మహిళల కట్టు, బొట్టుపై వ్యాఖ్యానించే స్థాయికి దిగజారిపోయారని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అది సగటు మహిళలందరినీ కించపరచడమే..
గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు కేవలం హోంమంత్రి అనితను అన్నట్టు మాత్రమే కాదని, అవి సగటు మహిళలందరినీ కించపరిచినట్లేనని పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రజా జీవితంలో ఉన్నవారు మహిళల గురించి మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. లీడర్ల నోటి నుంచి వచ్చే ప్రతి మాటను పౌర సమాజం నిశితంగా గమనిస్తోందనే విషయాన్ని ఏ ఒక్కరూ మరిచిపోకూడదని ఆయన హెచ్చరించారు.
విమర్శలు విధానపరంగానే ఉండాలి..
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఉండటం సహజమేనని, అయితే అవి ఎప్పుడూ విధానపరంగానే సాగాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏదైనా ఒక విధానం నచ్చకపోతే ఆ విధానం పైనే విమర్శలు చేయాలి తప్ప, వ్యక్తిగత దూషణలకు దిగకూడదన్నారు.
నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడుతూ స్త్రీలను కించపరిచే నైజం ఉన్న పార్టీ నేతల వ్యాఖ్యలను కూటమి నేతలు బలంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వైరి పక్షాల నేతలు మాట్లాడే మాటలు ఎంతటి అభ్యంతరకరమైనవో ప్రజలందరికీ అర్థమయ్యేలా తెలియజేయాలన్నారు.
ఎదుటి పార్టీ వారు దిగజారి మాట్లాడినంత మాత్రాన కూటమి నేతలు కూడా అదే బాట పట్టాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.
సమాజం హర్షించే భాషలోనే కౌంటర్..
పౌర సమాజం హర్షించే విధం మరియు పరిణతి చెందిన భాషలోనే కూటమి నేతలందరూ బలంగా బదులివ్వాలని స్పష్టం చేశారు. అవతలి పార్టీ వాళ్ల మాదిరిగా దిగజారుడు భాషను, అర్థరహితమైన వ్యాఖ్యలను ఉపయోగించాల్సిన అవసరం కూటమికి అస్సలు లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.









