BRS Working President KTR Slams CM Revanth Reddy | జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితోనే ‘హైడ్రా’ అని నామకరణం చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా వ్యాఖ్యానించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైడ్రా అనే పదం హిట్లర్‌కు చాలా ఇష్టమైనదని, చెరువులను కబ్జా చేసిన అక్రమార్కుల భరతం పట్టేందుకే తాము ఈ సంస్థను స్థాపించామని సీఎం సమర్థించుకున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర నిప్పులు చెరిగారు.
మొన్న ప్రజా పాలన.. నేడు హిట్లర్ పాలన..
మానవజాతి చరిత్రలోనే అతిపెద్ద నరమేధానికి కారకుడైన హిట్లర్ తనకు ఆదర్శమని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రికి సిగ్గుగా అనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.
“మొన్న ప్రజా పాలన అన్నావ్, నిన్న ఇందిరమ్మ పాలన అన్నావ్, నేడు ‘హిట్లర్ పాలన’ అని నువ్వే స్వయంగా ఒప్పుకున్నావ్” అంటూ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో సాగుతున్న రాక్షస పాలన ఆనవాళ్లు నిజంగానే హిట్లర్ ఆరాచకాన్ని తలపిస్తున్నాయని, యుద్ధం మిగిల్చే విషాదాలను మించిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో పేదలపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ సందర్భంగా పలు ఉదాహరణలను పేర్కొన్నారు.
బుల్డోజర్ల రాజకీయం..
హైడ్రా నుంచి మూసీ బాధితుల వరకు, లగచర్ల నుంచి వెలుగుమట్ల వరకు పేదల ఇళ్లపై విరుచుకుపడిన ప్రభుత్వ బుల్డోజర్లు రాష్ట్రంలో నడుస్తున్న “నయా నాజీ” పాలనకు నిజమైన సాక్ష్యాలని దుయ్యబట్టారు.
గత పదేళ్ల పాటు ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభాల పాతాళంలోకి నెట్టివేసిందని.. అధికారంలోకి వచ్చిన నాడే రేవంత్ రెడ్డి నియంత పోకడలు బయటపడ్డాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. హిట్లర్ స్ఫూర్తి అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారానికి దారితీస్తున్నాయి.







