Wednesday 27th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కర్ణాటక పాలిటిక్స్‌: ‘సిద్ధు’ మెలిక.. డీకే సీఎం అయ్యేనా?!

కర్ణాటక పాలిటిక్స్‌: ‘సిద్ధు’ మెలిక.. డీకే సీఎం అయ్యేనా?!

Siddaramaiah AHINDA card against DK | కర్ణాటక రాజకీయాలు మరోసారి అత్యంత ఉత్కంఠభరిత మలుపు తిరిగాయి. గత కొంతకాలంగా నలుగుతున్న నాయకత్వ మార్పు (Leadership Change) వ్యవహారం క్లైమాక్స్‌ కు చేరినట్లు కనిపిస్తోంది.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు కన్నడ నాట పెను సంచలనం రేపుతున్నాయి.

వచ్చే గురువారం ఆయన గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంతర్గత వర్గాల కథనం.

అయితే, సిద్ధరామయ్య దిగిపోయాక తదుపరి సీఎం ఎవరు? అనే రేసులో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరు బలంగా వినిపిస్తున్న తరుణంలో.. సిద్ధరామయ్య అధిష్టానం ముందు పెట్టిన ఒకే ఒక్క ‘మెలిక’ ఇప్పుడు డీకే శివకుమార్‌కు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చేలా ఉంది.

ఢిల్లీలో అర్ధరాత్రి హైకమాండ్ పంచాయతీ..
ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మంగళవారం ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సూర్జేవాలాలు.. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లతో సుదీర్ఘంగా, అత్యంత కీలక చర్చలు జరిపారు.

సీఎం పదవి నుంచి తప్పుకుని కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం సిద్ధరామయ్యను కోరింది. ఇందుకు బదులుగా సిద్ధుకు రాజ్యసభ స్థానం, కేంద్రంలో విపక్ష నేతగా (లేదా కీలక పదవి) అవకాశం ఇవ్వడంతో పాటు.. ఆయన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు కర్ణాటక కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి ఇస్తామనే బంపర్ ఆఫర్లను హైకమాండ్ ముందుంచినట్లు తెలుస్తోంది.

‘అహిందా’ అస్త్రంతో సిద్ధు రివర్స్ అటాక్..
ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం.. రెండున్నరేళ్ల తర్వాత తనకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని అధిష్టానం ఇచ్చిన మాటను డీకే శివకుమార్ ఈ సమావేశంలో గట్టిగా గుర్తుచేశారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది కాబట్టి తనను సీఎంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే ఇక్కడే సిద్ధరామయ్య తన అసలైన రాజకీయ చతురతను ప్రదర్శించారు. మొదట సీఎం పదవి నుంచి తప్పుకోవాలనే ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన సిద్ధు.. ఆ తర్వాత హైకమాండ్ ఒత్తిడికి తలొగ్గినా ఒక పక్కా కండిషన్ పెట్టారు.

తాను దిగిపోయాక కర్ణాటకలో కాంగ్రెస్ బలానికి పునాది అయిన ‘అహిందా’ (AHINDA – మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళితులు) వర్గానికి చెందిన వ్యక్తికే ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించాలని డిమాండ్ చేశారు.

డీకే శివకుమార్‌కు బిగ్ షాక్ ఎందుకంటే?
సిద్ధరామయ్య పెట్టిన ఈ ‘అహిందా’ నిబంధనకు గనుక కాంగ్రెస్ అధిష్టానం అంగీకరిస్తే.. ప్రబల ఒక్కలిగ (Vokkaliga) సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్‌కు సీఎం కుర్చీ దక్కడం అసాధ్యంగా మారుతుంది.

ఈ సమీకరణం అమల్లోకి వస్తే.. అహిందా వర్గానికి చెందిన ప్రస్తుత హోంమంత్రి జి. పరమేశ్వర్ (G. Parameshwara) రేసులోకి వచ్చి సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే జరిగితే సీఎం పదవి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డీకే శివకుమార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే అవుతుంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions