Tuesday 26th May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘జగన్‌ను జైల్లో పెడితే నాకేం లాభం’: పవన్ కళ్యాణ్

‘జగన్‌ను జైల్లో పెడితే నాకేం లాభం’: పవన్ కళ్యాణ్

Pawan Kalyan reacts to Prof. Nageshwar’s analysis| ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్టు ప్రొఫెసర్ కె. నాగేశ్వరరావు చేసిన ఒక రాజకీయ విశ్లేషణ తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టే వ్యవహారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పవన్ కళ్యాణ్‌కు క్లాస్ తీసుకున్నారంటూ సాగుతున్న ప్రచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా, అత్యంత ఘాటుగా స్పందించారు.

ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే తనకు వ్యక్తిగతంగా ఎంతో గౌరవం ఉందని పేర్కొంటూనే.. “రాజకీయ విశ్లేషణలు చేయడం వేరు, కేవలం వదంతులను (Rumors) ప్రచారం చేయడం వేరు” అని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.

అమిత్ షా క్లాస్ తీసుకున్నారనడం హాస్యాస్పదం..
ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ తన శైలిలో కొన్ని సూటి ప్రశ్నలను సంధించారు. “వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని నేను కోరుకుంటే.. అమిత్ షా గారు నాకు క్లాస్ తీసుకున్నారంటూ విశ్లేషణలు చేయడం నిజంగా హాస్యాస్పదం. అసలు జగన్ జైలుకు వెళ్తే నాకు రాజకీయంగా వచ్చే లాభం ఏంటి?” అని పవన్ ప్రశ్నించారు.

వ్యవస్థలను అవమానించడమే..
ఒక వ్యక్తిని జైల్లో పెట్టాలని తాము కోరడం లేదా ఆర్డర్ వేయడం లాంటివి జరగవని, ఒకవేళ ఎవరైనా తప్పు లేదా నేరం చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.

అంతేకానీ, ఫలానా వాళ్ళను జైల్లో పెట్టండి అని కోరడం అంటే దేశంలోని న్యాయ, దర్యాప్తు వ్యవస్థలను అవమానించడమే అవుతుందని పవన్ పేర్కొన్నారు.

విశ్లేషణల పేరిట వదంతులు వద్దు!
ప్రజాస్వామ్యంలో విమర్శలు, విశ్లేషణలు సహజమే అయినప్పటికీ, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు కేవలం ఊహాగానాలను నిజాలుగా ప్రచారం చేయడం సరికాదని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు.

కూటమి ప్రభుత్వం చట్టానికి లోబడే పనిచేస్తుందని, ఎవరిపైనా కక్షసాధింపు చర్యలకు తావులేదని, వ్యవస్థలు స్వతంత్రంగా తమ విధులను నిర్వహిస్తాయని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions