Team Indian For Aghan Series | క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ ఇచ్చేలా బీసీసీఐ (BCCI) కీలక ప్రకటన చేసింది. జూన్ 6 నుంచి అఫ్గానిస్తాన్‌తో ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ (One-off Test) మరియు మూడు మ్యాచ్‌ల వన్డే (ODI) సిరీస్ కోసం భారత జట్లను ఎంపిక చేసింది.
శుభ్‌మన్ గిల్ ఈ రెండు సిరీస్‌లలోనూ భారత జట్టుకు సారథిగా వ్యవహరించనుండటం విశేషం. ఈ జట్టు ఎంపికలో సీనియర్లకు విశ్రాంతి, యువకులకు పెద్దపీట వేస్తూ సెలెక్టర్లు షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు.
టెస్ట్ మరియు వన్డే కెప్టెన్సీ ఈక్వేషన్స్..
జూన్ 6న జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వన్డే జట్టులోకి స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి పునరాగమనం చేశారు. వన్డే ఫార్మాట్లో గిల్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) శ్రేయస్ వ్యవహరిస్తాడు.
రోహిత్, విరాట్ లకు చోటు కానీ.. ఈ సిరీస్ సెలెక్షన్లో సీనియర్ ఆటగాళ్లకు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుండి సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు.
సీనియర్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను వన్డే జట్టులోకి తీసుకున్నారు. అయితే, రోహిత్ శర్మతో పాటు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక అనేది పూర్తిగా బీసీసీఐ (BCCI) ఫిట్నెస్ ప్రోటోకాల్స్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.
నలుగురు కుర్రాళ్లకు అవకాశం..
దేశవాళీ క్రికెట్ లో రాణించిన నలుగురు యువ ఆటగాళ్లకు తొలిసారి భారత జట్టులో స్థానం దక్కింది. హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్లు రెండు జట్లలోనూ చోటు దక్కించుకోగా.. ప్రిన్స్ యాదవ్‌కు కేవలం వన్డే జట్టులో మాత్రమే తొలిసారి అవకాశం దక్కింది.







