Liquor Smuggling In Trains | అక్రమ మద్యం రవాణాకు స్మగ్లర్లు రూట్ మార్చారు. ఇప్పటివరకు కార్లు, లారీల క్యాబిన్లు, అంబులెన్సులలో మద్యాన్ని దాచడం చూశాం.. కానీ ఇప్పుడు ఏకంగా ఎక్స్ ప్రెస్ రైళ్లలోని ఏసీ కోచ్‌లను స్మగ్లింగ్ అడ్డాలుగా మార్చుకున్నారు.
గంగా-దామోదర్ ఎక్స్ ప్రెస్ రైలులోని ఏసీ కోచ్ బాత్రూమ్ సీలింగ్‌లో ప్రత్యేకంగా ‘రహస్య బంకర్లు’ ఏర్పాటు చేసి మద్యాన్ని తరలిస్తున్న ఒక అంతర్రాష్ట్ర సిండికేట్‌ను ధన్‌బాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
పక్కా సమాచారంతో శుక్రవారం ధన్‌బాద్ రైల్వే స్టేషన్లో గంగా-దామోదర్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిన సమయంలో ఆర్పీఎఫ్ బృందం ఏసీ కోచ్‌లోకి ప్రవేశించింది. అనుమానాస్పదంగా ఉన్న బాత్రూమ్ సీలింగ్‌ను పగలగొట్టి చూడగా అధికారులు సైతం నోరెళ్లబెట్టారు.
లోపల ఒకటి లేదా రెండు కాదు.. ఏకంగా మూడు క్రేట్ల విదేశీ బీర్ క్యాన్లను గుర్తించి తక్షణమే స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆర్పీఎఫ్ అధికారులు రైల్వే చార్టులు, ప్రయాణికుల రికార్డులు, స్టేషన్ సీసీటీవీ (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పశ్చిమ బెంగాల్‌లోని కుల్టి, సీతారాంపూర్; ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా, బనారస్; జార్ఖండ్‌లోని ధన్‌బాద్, హజారీబాగ్‌ల నుండి ఈ సరుకును రైళ్లలోకి ఎక్కిస్తున్నట్లు గుర్తించారు. మద్యం నిషేధం కఠినంగా అమలులో ఉన్న బీహార్ మార్కెట్‌కు ఈ మద్యాన్ని చేరవేసి భారీ లాభాలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సిండికేట్‌కు రైల్వే తనిఖీ షెడ్యూళ్లు, అధికారుల మూవ్మెంట్స్ మరియు రైళ్లు నడిచే మార్గాలపై పక్కా సమాచారం ఉందని ఆర్పీఎఫ్ పేర్కొంది. లోకల్ ఏజెంట్ల సహాయంతో సాధారణ రోజుల్లో ఎలాంటి తనిఖీల్లోనూ పట్టుబడకుండా వీరు ఈ దందాను సాగిస్తున్నారు. ప్రస్తుతం ధన్‌బాద్ ఆర్పీఎఫ్ కేసు నమోదు చేసి, ఈ నెట్వర్క్ వెనుక ఉన్న సూత్రధారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది.







