Friday 1st May 2026
12:07:03 PM
Home > క్రైమ్ > మెడికల్ సీట్ల పేరిట మోసాలు.. తల్లిదండ్రులకు సజ్జనార్ అలెర్ట్!

మెడికల్ సీట్ల పేరిట మోసాలు.. తల్లిదండ్రులకు సజ్జనార్ అలెర్ట్!

vc sajjanar

VC Sajjanar On MBBS Scams | వైద్య వృత్తిపై సమాజంలో ఉన్న గౌరవాన్ని, విద్యార్థుల క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని ఎంబీబీఎస్ సీట్ల పేరుతో మోసాలకు పాల్పడే కేటుగాళ్ల పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. నీట్ (NEET UG) పరీక్షల నేపథ్యంలో ఆయన విద్యార్థుల తల్లిదండ్రులకు పలు కీలక సూచనలు చేశారు.

దళారుల మోసపూరిత మాటలు..
నీట్‌లో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ, మేనేజ్‌మెంట్ కోటాలో అతి తక్కువ ధరకే ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని నమ్మబలికే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సీపీ హెచ్చరించారు.

చైనా, ఫిలిప్పీన్స్, కిర్గిజిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, అర్మేనియా, కరేబియన్ వంటి దేశాలలో అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్య పూర్తి చేయవచ్చంటూ ఆశ చూపే నకిలీ ఏజెంట్లతో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

గతంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ముఠాల మాటలు నమ్మి ఎందరో తల్లిదండ్రులు లక్షల రూపాయల కష్టార్జితాన్ని పోగొట్టుకున్నారని, విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయారని ఆయన గుర్తుచేశారు.

నగదు రూపంలో చెల్లింపులు వద్దు..
ఎంబీబీఎస్ అడ్మిషన్ల పేరుతో దళారుల చేతికి నేరుగా నగదు రూపంలో లక్షల రూపాయలు ఇవ్వకూడదని సీపీ సూచించారు. ఫీజులు ఏవైనా ఉంటే నేరుగా సంబంధిత యూనివర్సిటీ లేదా కాలేజీకి చెందిన అధికారిక బ్యాంక్ ఖాతాలకే చెల్లించాలని స్పష్టం చేశారు.

వేధిస్తే ఫిర్యాదు చేయండి..
ఎంబీబీఎస్ సీట్ల పేరుతో ఎవరైనా సంప్రదించినా, డబ్బుల కోసం వేధింపులకు గురిచేసినా వెంటనే ‘డయల్ 100’ కు సమాచారం ఇవ్వాలని లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ తెలిపారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions