Supreme Court on Live-in relationships | వివాహ బంధం లేని సహజీవన సంబంధాలలో ఉండే అనిశ్చితులు, ప్రమాదాలను సుప్రీంకోర్టు తాజాగా ఎత్తి చూపింది.
కేవలం ఒక సంబంధం నుండి బయటకు రావడమే నేరం కాదని, పరస్పర అంగీకారంతో కూడిన సంబంధాలకు, నేరపూరిత లైంగిక నేరాలకు మధ్య స్పష్టమైన తేడా ఉందని న్యాయస్థానం నొక్కి చెప్పింది.
పెళ్లి చేసుకోకుండానే ఒక వ్యక్తితో సంవత్సరాల తరబడి కలిసి జీవించి, బిడ్డను కూడా కన్న తర్వాత.. ఆ సంబంధం విడిపోయినప్పుడు ‘అత్యాచారం’ అని ఆరోపించడంపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు.
“పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం ఉన్నప్పుడు, అందులో నేరం అనే ప్రశ్నే తలెత్తదు” అని ఆమె స్పష్టం చేశారు.
పెళ్లికి ముందే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు అందులో కొన్ని సహజమైన రిస్కులు ఉంటాయని, వాటిని ముందే గ్రహించాలని కోర్టు పేర్కొంది.
ఒకవేళ వివాహం జరిగి ఉంటే ఆ మహిళకు చట్టపరంగా హక్కులు మరింత మెరుగ్గా ఉండేవని అభిప్రాయపడింది. సంబంధం అక్రమమైనా, ఆ బంధం వల్ల పుట్టిన బిడ్డ అక్రమ సంతానం కాదని.. ఆ బిడ్డకు భరణం పొందే హక్కు ఉంటుందని కోర్టు సానుభూతి వ్యక్తం చేసింది.
నిందితుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఒక మహిళ పిటిషన్ దాఖలు చేసింది.
అయితే ఆ వ్యక్తికి అప్పటికే నలుగురు భార్యలు ఉన్నారని బాధితురాలి తరఫు న్యాయవాది వాదించారు. ఈ క్రమంలోనే కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేస్తూ, విషయాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.






