Eli Crane H-1B visa bill 2026 impact Indians | అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ యువతకు ఊహించని దెబ్బ తగిలింది. హెచ్-1బీ వీసా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేలా రిపబ్లికన్ ఎంపీ ఎలీ క్రేన్ ప్రతినిధుల సభలో ఒక కఠినమైన బిల్లును ప్రవేశపెట్టారు.
“ఎండ్ హెచ్-1బీ వీసా అబ్యూస్ యాక్ట్ 2026” పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లులో సంచలన నిబంధనలు ఉన్నాయి. ఈ బిల్లు చట్టంగా మారితే, మొదటి మూడు సంవత్సరాల పాటు కొత్త హెచ్-1బీ వీసాల జారీని పూర్తిగా నిలిపివేస్తారు.
హెచ్-1బీ వీసా పొందాలంటే కనీస వార్షిక వేతనం 2,00,000 డాలర్లు అంటే సుమారు రూ. 1.67 కోట్లు ఉండాలి. ప్రస్తుతం ఏడాదికి 65,000 వీసాలు ఇస్తుండగా, ఆ సంఖ్యను ఏకంగా 25,000కు తగ్గించాలని ప్రతిపాదించారు.
ప్రస్తుతం ఉన్న అదృష్ట ఆధారిత లాటరీ విధానాన్ని రద్దు చేసి, కేవలం ఎక్కువ జీతం ఇచ్చే కంపెనీలకే వీసాలు ఇవ్వాలని బిల్లులో పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో పనిచేయడానికి వీలు కల్పించే ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్’ (OPT)ను పూర్తిగా రద్దు చేయనున్నారు.
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, పిల్లలను (H-4) అమెరికాకు తీసుకురావడాన్ని నిషేధించాలని ప్రతిపాదించారు. హెచ్-1బీ వీసాపై ఉన్నవారు అక్కడే ఉండి గ్రీన్ కార్డ్ (పర్మనెంట్ రెసిడెన్సీ) కోసం దరఖాస్తు చేసుకునే వీలుండదు. వీసా గడువు ముగియగానే స్వదేశానికి వెళ్లాల్సిందే.






