Minister Seethakka legal notice to KCR | తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) బీఆర్ఎస్ పై న్యాయ పోరాటానికి దిగారు.
అంగన్‌వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల పంపిణీలో అవినీతి జరిగిందంటూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు, పార్టీకి లీగల్ నోటీసులు పంపారు.
బీఆర్‌ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, ఆ పార్టీ ప్రతినిధి మన్నె క్రిషాంక్ చేసిన పోస్టుల ప్రకారం అంగన్‌వాడీలకు పంపిణీ చేసిన ‘శాంసంగ్ A06’ ఫోన్ అసలు ధర రూ. 8,499 మాత్రమేనని, కానీ మంత్రి సీతక్క ఆ ధరను రూ. 14,499 గా చూపించారని బీఆర్‌ఎస్ ఆరోపించింది.
ఈ ఫోన్ల కొనుగోలులో దాదాపు రూ. 30 కోట్ల మేర అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్ నేతలు పోస్టులు పెట్టారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంత్రి సీతక్క తన లీగల్ నోటీసు ద్వారా ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు.
ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఎటువంటి ఆధారాలు లేకుండా అవినీతి ముద్ర వేయడం తన ప్రతిష్టను దిగజార్చడమేనని ఆమె పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ పెట్టిన పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తక్షణమే ఆ తప్పుడు పోస్టులను సోషల్ మీడియా నుండి తొలగించాలని, తనపై చేసిన ఆరోపణలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.
అంగన్‌వాడీ కార్యకర్తల సాధికారత కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వివాదాల్లోకి నెట్టడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై బీఆర్‌ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.






