Nara Lokesh Satires On MAVIGUN | ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ (MAVIGUN) అంశంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
జగన్ చెప్పిన అక్షరాలకు లోకేశ్ తనదైన శైలిలో కొత్త నిర్వచనాన్ని ఇస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సెటైర్లు వేశారు. జగన్ ‘మావిగన్’ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెబితే.. లోకేశ్ మాత్రం కొత్త నిర్వచనంతో ఎద్దేవా చేశారు.
మావిగన్ లో మా అంటే మాయ, వి అంటే విధ్వంసం, గన్ అంటే గందరగోళం / గన్ కల్చర్ అంటూ పోస్ట్ చేశారు. “అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించి, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంటే.. మళ్ళీ మాయమాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
మీ ‘ప్లాన్-బి’ అంటే మాయ, విధ్వంసం, గందరగోళం సృష్టించడమేనా జగన్ గారు?” అంటూ లోకేశ్ ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి, ఇప్పుడు కొత్త కారిడార్ల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా లోకేశ్ #MavigunMavayya అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని వారు, లక్షల కోట్లతో కొత్త కారిడార్లు కడతారా అంటూ సెటైర్లు వేశారు. అమరావతిపై భయం మొదలైంది కాబట్టే ఇలాంటి వింత ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు.
లోకేశ్ ఇచ్చిన ఈ ‘మావిగన్’ కౌంటర్ ఇప్పుడు తెలుగుదేశం శ్రేణుల్లో విపరీతంగా వైరల్ అవుతుండగా, అటు వైసీపీ నేతలు కూడా దీనిపై ఘాటుగా స్పందిస్తున్నారు. రాజధానిపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.






