Monday 6th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అడవిలో తప్పిపోయిన టెక్కీ శరణ్య.. మూడు రోజుల తర్వాత..!

అడవిలో తప్పిపోయిన టెక్కీ శరణ్య.. మూడు రోజుల తర్వాత..!

Techie Saranya Rescued after 3 days

Tadiandamol Peak Trekker Rescue | కర్ణాటకలోని మూడవ ఎత్తైన శిఖరం టేడీయాండమోల్ (Tadiandamol) వద్ద ట్రెకింగ్‌కు వెళ్లి అడవిలో దారి తప్పిన కేరళకు చెందిన 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జి.ఎస్. శరణ్య కథ సుఖాంతమైంది.

గత మూడు రోజులుగా కొనసాగిన భారీ గాలింపు చర్యల అనంతరం ఆదివారం సాయంత్రం అటవీ ప్రాంతంలోని ఒక పాడుబడిన గుడిలో ఆమెను రెస్క్యూ టీమ్ గుర్తించింది.

శరణ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే వెల్లడించారు.

అసలేం జరిగిందంటే..
కేరళకు చెందిన శరణ్య ఏప్రిల్ 2, 2026న మరో 15 మంది సభ్యులతో కూడిన బృందంతో కలిసి మడికేరి ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని టేడీయాండమోల్ శిఖరం ట్రెకింగ్‌కు వెళ్లారు. అయితే తిరిగి వచ్చే క్రమంలో ఆమె దారి తప్పారు.

తాను దారి తప్పిపోయానని, తిరిగి వచ్చే మార్గం తెలియడం లేదని ఆమె తన బృందానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

తర్వాత ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి అటవీ శాఖ మరియు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

భారీ సెర్చ్ ఆపరేషన్..

శరణ్య ఆచూకీ కోసం సుమారు 70 మంది సిబ్బందితో కూడిన భారీ బృందం రంగంలోకి దిగింది. ఇందులో పోలీసులు, యాంటీ నక్సల్ ఫోర్స్ (ANF), అటవీ శాఖ సిబ్బంది మరియు స్థానిక వాలంటీర్లు పాల్గొన్నారు.

మొత్తం 12 బృందాలుగా విడిపోయి అడవిని జల్లెడ పట్టారు. గాలింపు కోసం థర్మల్ ఇమేజింగ్ డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్, మొబైల్ ఫోన్ ట్రాకింగ్ మరియు కాల్ డేటా అనాలసిస్ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు.

గిరిజనుల సమాచారంతో..
చివరికి స్థానిక గిరిజన గూడెం నివాసులు అందించిన సమాచారం ఈ ఆపరేషన్‌లో కీలకంగా మారింది. ఒకరోజు క్రితం తాము ఆమెను చూశామని వారు చెప్పడంతో, ఆ దిశగా గాలింపును ముమ్మరం చేశారు.

అడవి మధ్యలో ఉన్న ఒక పాత దేవాలయంలో ఆమె ఆశ్రయం పొందుతున్నట్లు గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

మూడు రోజుల పాటు ఒంటరిగా అడవిలో ఉన్నప్పటికీ ఆమె ధైర్యంగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions