- ఒక్కరోజే 90 వేల విక్రయాలు..
- అడ్రస్ ప్రూఫ్ లేకుండానే పొందే వెసులుబాటు!
5kg LPG cylinder Booking Online | పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో ఒడిదుడుకులు ఎదురవుతున్న తరుణంలో, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులకు ఊరటనిస్తోంది.
దేశవ్యాప్తంగా 5 కేజీల చిన్న గ్యాస్ సిలిండర్లకు ఒక్కసారిగా ఆదరణ పెరిగింది. మార్చి 23 నుంచి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 6.6 లక్షలకు పైగా ఈ సిలిండర్లు అమ్ముడైనట్లు కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది.
ముఖ్యంగా ఏప్రిల్ 4, శనివారం ఒక్కరోజే అత్యధికంగా 90 వేల సిలిండర్లు విక్రయించడం విశేషం.
ఎక్కడ, ఎలా కొనాలి..
వీటిని ‘ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ’ (Free Trade LPG) అని కూడా పిలుస్తారు. వీటిని కొనుగోలు చేయడం అత్యంత సులభం. ఎలాంటి బుకింగ్ అవసరం లేదు. సాధారణ సిలిండర్లలాగా ముందుగా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
గుర్తింపు కార్డు ఉంటే చాలు. నివాస ధ్రువీకరణ పత్రం (Address Proof) అవసరం లేకుండా, కేవలం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్, ఓటర్ ఐడి వంటివి) చూపిస్తే చాలు.
వినియోగదారులు నేరుగా తమకు దగ్గరలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ వద్దకు వెళ్లి వీటిని కొనుగోలు చేయవచ్చు.
సాధారణంగా గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. అయితే, ఈ 5 కేజీల చిన్న సిలిండర్లను మాత్రం మార్కెట్ ధరకే (సబ్సిడీ లేకుండా) కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల గ్యాస్ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, దేశంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తూ ప్రజలకు భరోసా ఇచ్చింది.






