Floccinaucinihilipilification Meaning | న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల్లో ఒక్కోసారి సామాన్యులకు అర్థంకాని అత్యంత క్లిష్టమైన ఆంగ్ల పదాలు కనిపిస్తుంటాయి.
తాజాగా బుధవారం ఢిల్లీ కోర్టు ఒక తీర్పు ఇస్తూ వాడిన ‘Floccinaucinihilipilification’ అనే పదం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అయింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతి భార్య లిపికా మిత్ర దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదును ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో తన భర్త ప్రతిష్టను దిగజార్చేలా నిర్మలా సీతారామన్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని లిపికా మిత్ర ఆరోపించారు.
అయితే, ఈ ఫిర్యాదును తోసిపుచ్చిన కోర్టు, ఈ పిటిషన్‌ను ‘Floccinaucinihilipilification’ గా అభివర్ణించింది. ఈ పదం ఉచ్చరించడం కష్టమైనా, దాని అర్థం చాలా సులభం. ఏదైనా ఒక వస్తువును లేదా విషయాన్ని “పూర్తిగా పనికిరానిది” లేదా “విలువ లేనిది” అని పరిగణించడాన్ని ఈ పదంతో సూచిస్తారు.
లిపికా మిత్ర వేసిన పరువు నష్టం దావాలో ఎలాంటి పస లేదని, అది విలువ లేనిదని చెప్పడానికి కోర్టు ఈ సుదీర్ఘమైన పదాన్ని వాడింది. 18వ శతాబ్దానికి చెందిన ఈ పదం లాటిన్ భాషలోని నాలుగు పదాల Flocci, Nauci, Nihili, Pili) కలయికతో ఏర్పడింది.
ఇవన్నీ కూడా “తక్కువ విలువ” అనే అర్థాన్ని ఇస్తాయి. గతంలో శశి థరూర్ వంటి నాయకులు ఇటువంటి కఠినమైన పదాలను వాడి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ఢిల్లీ కోర్టు ఈ పదాన్ని వాడటంతో గూగుల్ సెర్చ్‌లో దీని కోసం వెతికే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.






