Tuesday 31st March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > భార్య నుంచి విడాకులు..భర్త వింత మొక్కు!

భార్య నుంచి విడాకులు..భర్త వింత మొక్కు!

husband celebrates for getting divorce

Husband Celebrates For Getting Divorce | ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ (Basti) జిల్లాలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. భార్యతో గొడవలు, మానసిక వేదన భరించలేకపోయిన ఒక భర్త.. ఆమె నుండి తనకు విడాకులు లభిస్తే అమ్మవారికి దండవత్ యాత్ర చేస్తానని మొక్కుకున్నాడు.

కోర్టు ద్వారా విడాకులు మంజూరు కావడంతో, ఆ వ్యక్తి తన మొక్కును చెల్లించుకున్నాడు.

బస్తీ జిల్లా సోన్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్ఖోరియా గ్రామానికి చెందిన రవి అనే యువకుడికి 2022లో వివాహం జరిగింది. అయితే, పెళ్ళైన కొద్ది రోజులకే దంపతుల మధ్య తీవ్ర మనస్పర్థలు మొదలయ్యాయి.

నిత్యం గొడవలు, మానసిక ఒత్తిడితో సతమతమైన రవి.. ఈ నరకం నుంచి తనకు విముక్తి లభిస్తే భానూపూర్ లోని పౌరాణిక ‘మా బైడ్వా సమయ మాత’ ఆలయానికి తన గ్రామం నుండి దండవత్ యాత్ర చేస్తానని మొక్కుకున్నాడు.

గత రెండు ఏళ్లుగా కోర్టులో సాగిన విడాకుల కేసులో ఇటీవలే రవికి అనుకూలంగా తీర్పు వచ్చింది. జనవరి 2026లో అధికారికంగా విడాకులు మంజూరు కావడంతో, తన మొక్కు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం ఉదయం  ఉపవాసంతో తన గ్రామం నుండి యాత్ర ప్రారంభించాడు.

సుమారు 9 కిలోమీటర్ల దూరాన్ని నేలపై పడుకుంటూ, లేస్తూ దండవత్ ప్రణామం చేస్తూ పూర్తి చేయడానికి అతనికి దాదాపు 12 గంటల సమయం పట్టింది.

కఠినమైన రోడ్డుపై అంత దూరం దండవత్ యాత్ర చేయడం వల్ల అతని మోకాళ్లు, చేతులు తీవ్రంగా గాయపడి రక్తం వచ్చినా.. భార్య నుంచి విముక్తి లభించిందన్న సంతోషంతో యాత్రను పూర్తి చేశాడు.  

విశేషం ఏంటంటే, ఈ యాత్రలో రవి తల్లిదండ్రులు, స్నేహితులు మరియు గ్రామస్తులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్యాండ్ మేళాల మధ్య రవిని ఆలయం వరకు తీసుకెళ్లారు.

సాయంత్రం 6 గంటలకు ఆలయానికి చేరుకున్న రవి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు చెల్లించుకున్నాడు. “నేను నా భార్య వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను. ఈ విడాకులతో నాకు నరకం నుంచి విముక్తి లభించినట్టు అనిపిస్తోంది. అందుకే అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను” అని రవి మీడియాకు తెలిపాడు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions