Basavatarakam Hospital In Amaravathi | “పేద ప్రజలకు అత్యుత్తమ క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం” అని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు.
మంగళవారం హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో పనిచేసే అడ్వాన్స్‌డ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రంతో పాటు కొత్త అంబులెన్స్‌ను ఆయన ప్రారంభించారు.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) తమ సీఎస్‌ఆర్ నిధుల కింద అందజేసిన ఈ అల్ట్రాసౌండ్ మిషన్ ప్రత్యేకతలను బాలకృష్ణ వివరించారు.
ఈ యంత్రం ఏఐ సాంకేతికతతో పనిచేయడం వల్ల రిపోర్టులు అత్యంత ఖచ్చితంగా వస్తాయి. అతి తక్కువ సమయంలోనే స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. దీనివల్ల రోగులకు సకాలంలో చికిత్స అందించే వీలుంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీపి కబురు అందిస్తూ, అమరావతిలో ఆసుపత్రి నిర్మాణ అప్‌డేట్‌ను బాలకృష్ణ వెల్లడించారు. అమరావతి పరిధిలోని తుళ్లూరులో మరో వారం రోజుల్లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు భూమి పూజతో ప్రారంభం కానున్నాయి.
ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఏపీలోని క్యాన్సర్ బాధితులు వైద్యం కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, స్థానికంగానే ప్రపంచ స్థాయి చికిత్స అందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు మరియు దాతల సహకారం వల్లే బసవతారకం నేడు ఈ స్థాయికి చేరుకుందని బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.






