Hyderabad Police H-FAST Team | హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్ల భరతం పట్టేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది.
పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (VC Sajjanar) నేతృత్వంలో ‘హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్’ (H-FAST) పేరుతో ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ విభాగం నిన్న (మార్చి 19, 2026) అధికారికంగా ప్రారంభమైంది.
ఏమిటీ H-FAST?
ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేసేందుకు ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. పాత బేగం బజార్ పోలీస్ స్టేషన్ భవనంలో ఈ టీమ్ తన కార్యకలాపాలను సాగించనుంది.
H-FAST ప్రత్యేకతలు ఇవే:
ఈ టాస్క్‌ఫోర్స్‌లో 28 మంది సభ్యులు ఉంటారు. ఇందులో ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లు మరియు ఇతర సహాయక సిబ్బంది 24/7 నిఘా ఉంచుతారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఈ బృందం నగరంలోని హోటళ్లు, తయారీ కేంద్రాలు, గోదాములపై మెరుపు దాడులు చేస్తుంది. ఆహార కల్తీకి పాల్పడే వారిపై ఎటువంటి జాప్యం లేకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీ సజ్జనార్ ఆదేశించారు.
కేవలం దాడులకే పరిమితం కాకుండా, కల్తీ నెట్‌వర్క్ ఎక్కడ ఉందో పక్కా సమాచారంతో నిందితులను పట్టుకునేలా ఈ టీమ్ డిజైన్ చేయబడింది.
ప్రజల కోసం టోల్-ఫ్రీ నంబర్:
కల్తీ ఆహారం గురించి సమాచారం తెలిసినా లేదా ఎక్కడైనా అనుమానాస్పదంగా ఆహార తయారీ జరుగుతున్నా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ఒక టోల్-ఫ్రీ నంబర్‌ను కేటాయించింది.
H-FAST టోల్-ఫ్రీ నంబర్: 87126 61212
అలాగే H-FAST యొక్క అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా కూడా ప్రజలు తమ ఫిర్యాదులను పంపవచ్చు.






