Thursday 6th August 2026
12:07:03 PM
Home > తాజా > ఇది ‘ఫేక్, ఫ్యాబ్రికేటెడ్’ బడ్జెట్: కవిత

ఇది ‘ఫేక్, ఫ్యాబ్రికేటెడ్’ బడ్జెట్: కవిత

Kavitha On TG Budget 2026-27 | తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ అని, ఇది ప్రజలను వంచించే “రీ-విజన్” బడ్జెట్ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఉగాది సందర్భంగా ‘ప్రజా బడ్జెట్’ పేరుతో జాగృతి నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ నాయకులు ఒకరిని మించి ఒకరు అబద్ధాలు (ఫేక్) చెప్తున్నారని కవిత ఎద్దేవా చేశారు. “మా హైదరాబాద్‌లో ‘సలీం ఫేక్’ అనే నటుడు తన మాటలతో కనీసం నవ్విస్తాడు.

కానీ రాహుల్ గాంధీ తన ఫేక్ మాటలతో ప్రజలను ఏడిపిస్తున్నాడు. అందుకే ఆయనకు ‘రాహుల్ ఫేక్’ అని నామకరణం చేస్తున్నాం” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రం మొత్తం అప్పు ₹8,64,198 కోట్లకు చేరిందని, దీని ప్రకారం ఒక్కో వ్యక్తిపై ₹2.16 లక్షలు, ప్రతి కుటుంబంపై దాదాపు ₹9 లక్షల అప్పు భారం పడిందని ఆమె లెక్కలు వివరించారు. ఇంత అప్పు తెచ్చినా ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయలేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్‌లో కేవలం 4 శాతం నిధులే కేటాయించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఏటా ₹20 వేల కోట్లు ఇస్తామన్న రాహుల్, ప్రియాంక గాంధీల మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జాగృతి మాత్రమే ఎంబీసీల (MBC) పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం చెబుతున్న ‘రైజింగ్ తెలంగాణ’ నిరుద్యోగంలో నంబర్ వన్ స్థానంలో ఉందని కవిత విమర్శించారు.

“రాష్ట్రంలో ప్రతి నలుగురు అబ్బాయిల్లో ఒకరికి, ఇద్దరు అమ్మాయిల్లో ఒకరికి మాత్రమే ఉద్యోగం దొరుకుతోంది. మహిళా నిరుద్యోగం 50 శాతానికి చేరింది” అని ఆందోళన వ్యక్తం చేశారు.

స్త్రీనిధి, సెర్ప్ విభాగాల్లో 14 ఏళ్లుగా కొనసాగుతున్న జి. విద్యాసాగర్ రెడ్డిని దయ్యం తో పోల్చారు. ఆయనపై విచారణ జరిపి వెంటనే తొలగించాలని మంత్రి సీతక్కను డిమాండ్ చేశారు.

22.5 లక్షల ఇళ్లు కడతామని చెప్పి, కేవలం ₹5,500 కోట్లే కేటాయించడం దగా అని అన్నారు. ‘బడే భాయ్’ మోడీ అంటూ ఢిల్లీ వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కనీసం ₹100 కూడా అదనంగా తేవడంలో విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో కల్తీ మాఫియా చెలగాటమాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions