Pruthvi Shah Engagement | భారత యువ క్రికెటర్ పృథ్వీ షా (Pruthvi Shah) తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. టాలీవుడ్ హీరోయిన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆకృతి అగర్వాల్ (Akrithi Agarwal)తో ఆదివారం ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను షా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “మైదానంలో సిక్సర్లు కొట్టడం నుండి, జీవితాంతం కలిసి ఉండే ఇన్నింగ్స్ మొదలైంది. ఆమె నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్” అంటూ రాసుకొచ్చారు. లక్నోకు చెందిన ఆకృతి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ‘త్రిముఖ’ అనే తెలుగు చిత్రం ద్వారా ఆమె వెండితెరపై అరంగేట్రం చేశారు.
ఇటీవల అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకలో ఈ జంట కలిసి కనిపించడంతో వీరిద్దరి పెళ్లిపై అప్పట్లోనే ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా, 2018లో టెస్ట్ అరంగేట్రంలోనే సెంచరీ బాది సంచలనం సృష్టించిన పృథ్వీ షా, ఆ తర్వాత ఫామ్ కోల్పోవడం మరియు క్రమశిక్షణారాహిత్యం వల్ల జాతీయ జట్టుకు దూరమయ్యారు. 2025 ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని షా, ఇటీవల జరిగిన 2026 మినీ వేలంలో చివరి నిమిషంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ₹75 లక్షల బేస్ ప్రైస్‌కు ఎంపికయ్యారు.






