Ganesh idol resembling CM Revanth | వినాయక చవితి (Ganesh Chaturthi) సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరంలోని గల్లీ గల్లీలో వివిధ రూపాల్లో గణనాథులను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని అఘాపురాలో తెలంగాణ ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని పోలినట్లుగా గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
సీఎం రేవంత్ (CM Revanth Reddy) డ్రెస్సింగ్ స్టైల్లో, రైజింగ్ తెలంగాణ థీమ్ తో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ విగ్రహం ఏర్పాటుపై స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
రాజాసింగ్ (MLA Rajasingh) స్పందిస్తూ “సీఎం రేవంత్ రెడ్డి దేవుడు కాదు, ఆయన రూపంలో విగ్రహం పెట్టడం సరికాదు” అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈ విగ్రహాన్ని, మండపాన్ని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు.
ముఖ్యమంత్రిపై గౌరవంతోనే విగ్రహం పెట్టి ఉండవచ్చని, కానీ ఇలాంటి చర్యలు హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీస్తాయని తన లేఖలో పేర్కొన్నారు. మత విశ్వాసాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఆ విగ్రహాన్ని తొలగించారు. ఆ స్థానంలో మరో విగ్రహం ఏర్పాటు చేశారు.









