Hydraa Saves Rs 400 Crore Govt Land | జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములు, చెరువులు నాలాలను పరిరక్షిస్తున్న హైడ్రా (Hydraa) తాజాగా రూ. 400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్ క్లేవ్లో పార్కులతో పాటు రహదారులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. 22.20 ఎకరాల్లో సుమారు 100 ప్లాట్లతో అనుమతి పొందిన ఈ లేఔట్లో 4 పార్కులు ఉండేవి.
అందులో 2 కబ్జాకు గురయ్యాయి. వీటితోపాటు 5 వేల గజాల మేర రోడ్డు కూడా కబ్జాకు గురైంది. మరో 300ల గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన హోటల్ షెడ్డును కూడా హైడ్రా తొలగించింది. ఇలా మొత్తం 16000 గజాల స్థలాన్ని హైడ్రా కబ్జా కోరల నుంచి విడిపించింది.
దీని విలువ సుమారు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. జీహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేసిన పార్కులను జైహింద్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారంటూ జూబ్లీ ఎన్ క్లేవ్ లేఔట్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
దీనిపై క్షేత్రస్థాయిలో విచారించిన హైడ్రా అధికారులు కబ్జాలు వాస్తవమే అని నిర్ధారించుకున్నారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు వాటిని గురువారం తొలగించారు.









